JK Rajouri Mystery deaths : జమ్మూకశ్మీర్ రాజౌరీ జిల్లాలోని బుధాల్ గ్రామంలో అంతుచిక్కని మరణాలపై దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు. 45 రోజుల్లో 17 మంది చనిపోవడాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు చెప్పిన జమ్ముకశ్మీర్ ప్రభుత్వం త్వరలోనే మరణాల మిస్టరీని ఛేదిస్తామని తెలిపింది.
మిస్టరీ వీడేనా?
మంగళవారంనాడు బుధాల్ గ్రామానికే చెందిన ఇజాజ్ అహ్మద్ అనే 24 ఏళ్ల వ్యక్తి ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్చారు. బుధాల్ గ్రామంలో మరణాలకు బ్యాక్టీరియా లేదా వైరస్ కారక వ్యాధులు కారణం కాదని ప్రాథమికంగా తేలినట్లు అధికారులు వెల్లడించారు. ఫలితంగా అక్కడి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం, దర్యాప్తు కోసం 11 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.
కంటైన్మెంట్ జోన్‌గా బుధాల్!
మరోవైపు మరణాల నిగ్గుతేల్చేందుకు అధికారులు ఆ గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఇకపై గ్రామంలో ఎలాంటి ప్రభుత్వ, ప్రైవేటు సమావేశాలు జరపకూడదని నిషేధాజ్ఞలు జారీ చేశారు. గ్రామాన్ని మూడు కంటైన్‌మెంట్ జోన్‌లుగా విభజించారు. మరణాలు సంభవించిన కుటుంబాలను కంటైన్‌మెంట్ జోన్ 1లో పెట్టారు. బాధిత కుటుంబాల నివాసాలకు సీల్ వేశారు. బాధిత కుటుంబాల సన్నిహితులుగా గుర్తించిన కుటుంబాలకు చెందిన వ్యక్తుల నివాసాలను కంటైన్‌మెంట్ జోన్-2లో చేర్చారు. వీరి ఆరోగ్య పరిస్థితులను వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గ్రామంలో మిగిలిన నివాసాలను కంటైన్‌మెంట్ జోన్-3గా ప్రకటించి ఇక్కడి ప్రజలు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారనే అంశంపై ఆరా తీస్తున్నారు.
ఆ ఆహారం మాత్రమే తీసుకోవాలి!
బాధిత కుటుంబాలు, వారి సన్నిహితులు అధికారులు అందించే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని, వారి ఇళ్లలో ఉన్న ఇతర పదార్థాలను వినియోగించకూడదని హెచ్చరికలు జారీ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా బాధిత కుటుంబాల ఇళ్లలో తినదగిన పదార్థాలు అన్నిటినీ స్వాధీనం చేసుకొని పరీక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది.
సీఎం సానుభూతి!
జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా మంగళవారం బాధిత కుటుంబాలను కలిసి సానుభూతి తెలిపారు. ఈ మరణాల వెనుక మిస్టరీని తెలుసుకొనేందుకు దర్యాప్తు కొనసాగుతోందన్న ఆయన, అన్ని ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరుకుతుందని హామీ ఇచ్చారు.