Sachin Tendulkar International Masters League 2025 : ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టోర్నమెంట్లో ఇండియా మాస్టర్స్ వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సచిన్ తెందుల్కర్ నేతృత్వంలోని ఆ జట్టు బుధవారం ఆడిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. మొదట ధవళ్ కులకర్ణి (3/21), పవన్ నేగి (2/16), అభిమన్యు మిథున్ (2/27)ల ధాటికి ఇంగ్లాండ్ 8 వికెట్లకు 132 పరుగులే చేయగలిగింది.
టిమ్ ఆంబ్రోస్ (23), డారెన్ మ్యాడీ (25) మాత్రమే రెండకెల స్కోర్లు సాధించారు. ఆ తర్వాత లక్ష్యాన్ని ఇండియా 11.4 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. తొలి మ్యాచ్‌లో 10 పరుగులే చేసిన సచిన్ ఈ సారి దూసుకెళ్లాడు. 21 బంతుల్లోనే 34 పరుగులు చేసి ఔటయ్యాడు. ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించిన మాస్టర్ 5 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. గుర్‌కీరత్ (63*), మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. యువరాజ్ (27*) కూడా మంచి స్కోర్‌తో రాణించాడు.
ఇండియా మాస్టర్స్ జట్టు : సచిన్ తెందూల్కర్ (కెప్టెన్), సౌరభ్ తివారీ, గుర్‌కీరత్ సింగ్ మాన్, అంబటి రాయుడు, యువరాజ్ సింగ్, స్టువర్ట్ బిన్నీ, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, నమన్ ఓజా, అభిమన్యు మిథున్, ధవల్ కులకర్ణి, రాహుల్ శర్మ, షాబాజ్ నదీమ్, వినయ్ కుమార్
దశాబ్దం తర్వాత
ఇక ఈ జట్టులో మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కూడా ఉన్నాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో యువీ బరిలోకి దిగాడు. దీంతో దశాబ్ద కాలం తర్వాత సచిన్- యూవీ మైదానంలో కలిసి ఆడారు. ఈ జోడీ 2011 వన్డే వరల్డ్‌కప్‌లో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడింది. వీరిద్దరూ మళ్లీ టీమ్ఇండియా జెర్సీ ధరించి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు.
మ్యాచ్‌లు ఎక్కడ జరగనున్నాయి?
IML మ్యాచ్‌లకు భారత్‌లోని మూడు ప్రధాన నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. తొలి ఐదు మ్యాచ్‌లు నవీ ముంబయిలో షెడ్యూల్ చేశారు. ఆ తర్వాతి మ్యాచ్‌లు రాజ్‌కోట్‌లో నిర్వహిస్తారు. సెమీస్ ఇంకా, ఫైనల్ మ్యాచ్‌లకు రాయ్‌పూర్ వేదిక కానుంది.
లైవ్ ఎక్కడ చూడవచ్చు?
IML మ్యాచ్‌లను డిస్నీ+ హాట్‌స్టార్ (వయా జియోస్టార్), కలర్స్ సినీప్లెక్స్ (SD & HD), కలర్స్ సినీప్లెక్స్ సూపర్‌హిట్స్ ద్వారా లైవ్ చూడవచ్చు. అన్ని మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.
BCCI అవార్డులు- సచిన్, బుమ్రా, అశ్విన్‌కు అరుదైన గౌరవం
సచిన్‌కు బీసీసీఐ ఘన సత్కారం - ఈ అవార్డుతో ఆ దిగ్గాజాల లిస్ట్‌లోకి!