Beerakaya Egg Burji Recipe in Telugu : నార్మల్‌గా మనందరం ఉల్లిపాయతో ఎగ్ బుర్జీ ప్రిపేర్ చేసుకుంటుంటాం. కానీ, ఎప్పుడూ ఒకే రకమైన బుర్జీ తింటే బోరింగ్‌గా అనిపిస్తుంది. అందుకే, ఓసారి రొటీన్‌గా కాకుండా ఈ స్పెషల్ బుర్జీ రెసిపీని ట్రై చేయండి. సరికొత్త టేస్ట్‌తో వహ్వా అనిపిస్తుంది. అదే, "బీరకాయ ఎగ్ బుర్జీ". బ్యాచిలర్స్, ఆఫీస్‌కి వెళ్లే వారు చాలా తక్కువ సమయంలో, లంచ్ బాక్సులోకి దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నం, చపాతీ, రోటీ, పూరీలు ఇలా దేనిలోకైనా ఈ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి, ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- బీరకాయలు - అరకేజీ
- కోడి గుడ్లు - 4
- ఉల్లిపాయలు - 2 (మీడియం సైజ్‌వి)
- పచ్చిమిర్చి - 2
- నూనె - పావు కప్పు
- జీలకర్ర - 1 టీస్పూన్
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఎండుమిర్చి - 2
- సన్నని అల్లం తరుగు - 1 టీస్పూన్
- ఉప్పు - కొద్దిగా
- పసుపు - అరటీస్పూన్
- కారం - తగినంత
- ధనియాల పొడి - 1 టీస్పూన్
- కొత్తిమీర తరుగు - 2 టేబుల్‌స్పూన్లు
- గరం మసాలా - చిటికెడు
బ్రెడ్‌తో ఇలా చిటికెలో బజ్జీలు చేయండి - పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా లేత బీరకాయలను ఎంచుకొని చెక్కు తీసి, క్యూబ్స్ మాదిరిగా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే, ఉల్లిపాయలను సన్నగా, పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, ఎండుమిర్చిని తుంపి వేసుకొని బాగా వేయించుకోవాలి.
- అవి వేగాక సన్నని అల్లం తరుగు వేసి మరికాసేపు వేయించాలి. ఆ తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ తరుగు, ఉప్పు, పసుపు వేసి కలిపి ఆనియన్స్ బాగా మగ్గే వరకు కుక్ చేసుకోవాలి.
- ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న లేత బీరకాయ ముక్కలు వేసి గరిటెతో కలుపుతూ రెండు నిమిషాల పాటు హై-ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి.
- అనంతరం మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద బీరకాయ ముక్కలు మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి.
- ఆవిధంగా ఉడికించుకున్నాక అందులో కారం, ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలిపి మూతపెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి.
- ముక్కలు మగ్గి, నూనె పైకి తేలడం స్టార్ట్ అయ్యాక గుడ్లను కొట్టి పోసుకోవాలి. ఆపై వెంటనే కదపకుండా మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద 3 నుంచి 4 నిమిషాలు మగ్గనివ్వాలి.
- ఆ తర్వాత మూత తీసి గుడ్డు పొరటు మిశ్రమాన్ని గరిటెతో కలుపుతూ మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్ మీద కర్రీలో నూనె పైకి తేలేదాక బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందుకోసం కనీసం 12 నుంచి 15 నిమిషాల టైమ్ పట్టొచ్చు.
- ఆ విధంగా ఉడికించుకున్నాక చివర్లో కొత్తిమీర తరుగు, గరం మసాలా వేసి కలిపి దింపేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే నోరూరించే "బీరకాయ ఎగ్ బుర్జీ" రెడీ!
క్యాబేజీ ఇంట్లో ఎవ్వరూ తినట్లేదా? - ఇలా "క్యాబేజీ ఎగ్ బుర్జీ" చేయండి! - టేస్ట్ అదుర్స్ అంతే!!