Telangana Govt Exercise On Budget 2024-25 :జులై నెలాఖరులోగా పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ఉభయసభల ఆమోదం పొందాల్సి ఉంది. ఇందుకోసం వచ్చేనెల మొదటివారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ పద్దు కసరత్తు ప్రారంభించింది. పూర్తిస్థాయి బడ్జెట్ రూపకల్పనలో భాగంగా అన్ని శాఖల నుంచి ఇప్పటికే ఆర్థికశాఖ ప్రతిపాదనలను కోరింది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి సంబంధించి ఆయా శాఖల పనితీరు సూచికల ఆధారంగా నిర్దేశించిన లక్ష్యాల వివరాలను ఇవ్వాలని స్పష్టం చేసింది.
పథకాలకు తగిన ప్రాధాన్యత : 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ఆయాశాఖల పరిధిలోని పథకాల వ్యయ ప్రతిపాదనలను క్షుణ్నంగా సమీక్షించాలని ఆర్థికశాఖ తెలిపింది. ప్రభుత్వ ప్రాధాన్యత, ఆయా పథకాల కొనసాగింపు అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొంది. తెలంగాణ సర్కార్ ప్రాధాన్య పథకాలకు పద్దు ప్రతిపాదనల్లో తగిన కేటాయింపులు చేయాలని ఆర్థికశాఖ వెల్లడించింది.
TG GOVT on Budget Proposals 2024-25: ప్రభుత్వపరంగా చేసిన ముఖ్యమైన ప్రకటనలను దృష్టిలో ఉంచుకోవాలని, వాటికి సరిపడా నిధులు, తగిన అనుమతులు తీసుకొని ప్రతిపాదించాలని ఆర్థికశాఖ సూచించింది. బడ్జెట్ అంచనాలకు హేతుబద్ధత ఉండాలని తెలిపింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకొని వీలైనన్ని ఎక్కువనిధులు పొందేలా స్పర్ష్ మార్గదర్శకాలకు లోబడి ప్రతిపాదనల తయారీలో చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. కేవలం పథకాలకు సంబంధించిన వ్యయ ప్రతిపాదనలను మాత్రమే ఇవ్వాలని వెల్లడించింది. నిర్వహణ వ్యయానికి సంబంధించిన గతంలో ఇచ్చిన ప్రతిపాదనల ఆధారంగా కేటాయింపు చేయనున్నట్లు వివరించింది.
18నుంచి బడ్జెట్ సన్నాహక సమావేశాలు : పథకాలకు సంబంధించిన వ్యయ ప్రతిపాదనలను ఆయా శాఖల ఈ నెల 12 నుంచి 15 వరకు ఆర్థికశాఖ పోర్టల్లో ఆన్‌లైన్ విధానంలో పొందుపర్చాల్సి ఉంటుంది. ఆయా శాఖల సచివాలయ పరిపాలనా విభాగాలు ఆ ప్రతిపాదనలు పరిశీలించి, అభిప్రాయాలతో 18వరకు ఆర్థికశాఖకు పంపాల్సి ఉంటుంది. అదే రోజు నుంచి శాఖల వారీగా బడ్జెట్ సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ఆయా శాఖల మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆ రోజు నుంచి భేటీ కానున్నారు.