Sankranti Tradition Gurugula Nomu in Telangana :సాధారణంగా పెళ్లైన మహిళలు తమ సౌభాగ్యం, దాంపత్యం, సంతానం మొదలైనవి సక్రమంగా ఉండాలనే ఆకాంక్షతో కొన్ని నోములు ఆచరిస్తారు. అయితే, తోడబుట్టిన అన్నదమ్ములు, పుట్టింటివారు క్షేమంగా ఉండాలనే ఆకాంక్షతో ఆచరించే నోములు కూడా కొన్ని ఉన్నాయి. ప్రతీ సంవత్సరం శ్రావణ, భాద్రపద మాసాల్లో తెలుగునాట ప్రతి ఇంటా ఎన్నో నోములు, వ్రతాలు చేస్తుంటారు. అయితే, ఈ సంక్రాంతి పండగ సమయంలో చిన్న పిల్లలు నోము నోచుకునే సంప్రదాయం తెలంగాణలో కనిపిస్తుంది. ఈ సంప్రదాయం గురించి ఎక్కువ మందికి తెలియదు! కొన్ని ప్రత్యేక నియమాలతో ఈ నోము నోస్తారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
రెండు తెలుగు రాష్ట్రాల్లో భోగి రోజునచిన్నారులకు భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తారు. శనగలు, రేగు పండ్లు, నాణేలు, పూలు కలిపి పోస్తారు. ఈ కాలంలో దొరికే రేగు పళ్లు పిల్లల తలపై పోయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని భావిస్తారు. అయితే, తెలంగాణలో అయిదేళ్ల వరకూ అందరిలాగే చిన్నారులకు భోగిపండ్లు పోస్తారు. ఆ తర్వాత మిగతాచోట్ల ఓణీల వేడుక చేసినట్లు ఇక్కడ 'గురుగుల నోము' చేస్తారు. దీనిని సాధారణంగా అమ్మాయిలకు 9, 11, 13 ఏళ్లలో ప్రారంభిస్తారు. 13 దొంతులు పెట్టి, 13 వస్తువులతో వారి చేత నోము నోయిస్తారు.
పెళ్లి నోము:
ఒక్కసారి నోము ప్రారంభమైతే ప్రతి సంవత్సరమూ చేసుకోవాల్సిందే. పిల్లలతో ఏటా ఒక్కోరకం నోము నోచుకుంటారు. పెళ్లయ్యాక 'పెళ్లి నోము'లు ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమంలో వధూవరులిద్దరి తరఫు బంధువులూ ఒక్కచోట కలుసుకుంటారు. వధువుచేత పెళ్లి నోము నోయిస్తారు. ఈ వేడుకలో ఊళ్లోవాళ్లందరినీ బంధుత్వపు వరస కలిపి నోరారా పలకరిస్తారు. అలాగే 'సందె దీపాలనోము' నోచుకున్న మహిళలు సంధ్య వేళ 75 ఇళ్లకు వెళ్లి స్వయంగా ఆ ఇళ్లలో దీపం వెలిగిస్తారు. ఇంట్లో దీపం పెట్టిన ఆడపిల్ల పట్ల ఆ ఇంటివారికి బాధ్యతతో కూడిన బంధం ఏర్పడుతుందని భావిస్తారు.