HMDA Assessment on LRS Revenue : అక్రమ ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకంపై (ఎల్‌ఆర్‌ఎస్ ) హెచ్‌ఎండీఏ భారీ ఆశలు పెట్టుకొంది. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో రాయితీతో పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తోంది. ముఖ్యంగా మార్చి 31తేదీలోపు క్రమబద్ధీకరణ చేయించుకున్న వారికి ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తాజాగా మంత్రులు ప్రకటించడం వల్ల త్వరితగతిన దరఖాస్తులు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆ లెక్కన దాదాపు రూ.1000 కోట్ల వరకు ఆదాయం సమకూరనున్నట్లు హెచ్‌ఎండీఏ భావిస్తోంది.
హెచ్‌ఎండీఏ పరిధిలోని 7 జిల్లాల్లో దాదాపు 1337 లేఅవుట్లలో 3.20 లక్షల గ్రామపంచాయతీ (జీపీ) ప్లాట్లు ఉండగా ఇందులో లక్ష ప్లాట్ల దరఖాస్తులను పరిశీలించారు. తాజాగా సర్కారు రాయితీ ప్రకటించిన నేపథ్యంలో చాలామంది ముందుకొచ్చి క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉంది.
200 చదరపు అడుగు స్థలానికి రూ.66 వేల వరకు : ప్లాట్ల క్రమబద్ధీకరణ ద్వారా ఎంత రాయితీ వస్తుందనేది కీలక ప్రశ్న. ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుంటే. మీకు హెచ్‌ఎండీఏ పరిధిలో 200చ.అ( చదరపు అడుగుల) స్థలం ఉంది అనుకుందాం. ఇది రెండు వందల నలబై చదరపు గజాలతో సమానం. అక్కడ మార్కెట్ విలువ చదరపు గజానికి రూ.5000 ఉంటే 200 చ.గ. స్థలం విలువ రూ.10 లక్షల అవుతుంది. దీనిపై 20 శాతం క్రమబద్ధీకరణ ఫీజు రూ.2 లక్షలు దానిపై ఓపెన్ స్పేస్ ఛార్జీలు ప్రతి చదరపు అడుగుకి 0.14 శాతం(భూమి) వంతున 33.6 గజాలకు చెల్లించాల్సి ఉంటుంది.
ఓపెన్ స్పేస్ రుసుము ప్రతి గజానికి రూ.2 వేలు(ఇవి మారుతూ ఉంటాయి) అనుకుంటే అదనంగా ఆ ఛార్జీలు రూ.67,200 వరకు లెక్కతేలుతుంది. ఈ విధంగా మొత్తం క్రమబద్ధీకరణ ఫీజు రూ.2,67,200 కాగా ఇందులో 25 శాతం రాయితీ అంటే రూ.66,800. ఇవి పోను రూ.2,00,400లు చెల్లిస్తే సరిపోతుంది.
ఇలా ఉంటే అర్హత : గతంలో అక్రమ లేఅవుట్‌లో ప్లాటు కొనుగోలు చేసినట్లైతే తాజాగా కొన్ని మార్గదర్శకాలు అనుసరించి వాటిని క్రమబద్ధీకరణ చేసుకోవచ్చునని హెచ్‌ఎండీఏ అధికారులు వివరించారు. ఆయా అక్రమ లేఅవుట్లలో ప్లాట్ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్) కోసం ఇప్పటికే దరఖాస్తు చేసి ఉండాలి.
సంబంధిత లేఅవుట్‌లో కనీసం పది శాతం ప్లాట్లు అమ్ముడై ఉండాలి. అలాంటి వాటిలో మిగతా ప్లాట్లను ప్రస్తుతం క్రమబద్ధీకరణ చేస్తున్నారు. చెరువుల ఎఫ్‌టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవల్), బఫర్‌జోన్, ప్రభుత్వ స్థలాలు, పట్టణ భూగరిష్ఠ చట్టం మిగులు భూములు, దేవాదాయ భూముల్లో లేఅవుట్లు ఉంటే అలాంటి వాటిలో గతంలో రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ తాజాగా అనుమతించరు.
ఎల్‌ఆర్‌ఎస్ లబ్ధిదారులకు బంపర్ ఆఫర్ - ఆ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకుంటే 25 రాయితీ
LRS లబ్ధిదారులకు గుడ్‌న్యూస్ - పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటికీ వన్‌టైమ్ సెటిల్మెంట్!