PDS Rice Goes to Beer Companies : రాష్ట్రంలో పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం(పీడీఎస్) ఎక్కువ శాతం బీర్ల తయారీ (బెవరేజస్) కంపెనీలకు తరలుతోంది. నేరుగా రేషన్ బియ్యాన్ని తరలిస్తుంటే తనిఖీల్లో చిక్కుతామనే భయంతో బియ్యాన్ని నూకగా మార్చి తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లోని బీర్ల తయారీ కంపెనీలకు టన్నుల కొద్దీ సరఫరా చేస్తున్నారు. దొడ్డు బియ్యంలో గంజి శాతం అధికంగా ఉండడం వల్ల మిగతా పదార్థాలతో కలిసి త్వరగా పులుస్తుంది. తక్కువ ధరకు వస్తుండడం వల్ల బెవరేజస్ కంపెనీలు వీటి కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా పౌరసరఫరాల శాఖ నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయాలు వెలుగుచూశాయి.

రేషన్ బియ్యం అక్రమాల దారి :
- మహబూబాబాద్ జిల్లాలో కొంతమంది డీలర్ల వద్ద గుర్తించిన నిత్యావసర సరకులివి. బియ్యం వద్దనుకున్న రేషన్ కార్డుదారులకు కిలోకు 10 రూపాయల చొప్పున లెక్కకట్టి ఆమేరకు నిత్యావసర సరకులను డీలర్లే ఇస్తున్నట్లు వెల్లడైంది.
- ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట, గూడూరు కేసముద్రం, చెన్నరావుపేట, దుగ్గొండి, నెక్కొండ, ప్రాంతాల్లోని పలు మిల్లుల్లో రేషన్ బియ్యాన్ని రాత్రిపూట నూకగా మారుస్తున్నారు. ఆయా ఘటనలకు సంబంధించి గతేడాది ఉమ్మడి జిల్లాలో 225 కేసులు నమోదయ్యాయి.
- ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ పీడీఎస్(రేషన్) బియ్యం అక్రమ రవాణా కేసులు ఏటా 150 వరకు నమోదవుతున్నాయి.
- బోధన్ డివిజన్‌లోని మూడు మిల్లులు, నిజామాబాద్ డివిజన్‌లో రెండు, ఆర్మూర్ డివిజన్‌లోని ఓ మిల్లులో బియ్యాన్ని నూకలుగా మారుస్తున్నారు. ఈ దందాలో దళారులుగా ఉన్నవారిలో అత్యధికులు రౌడీషీటర్లేనని ఓ పోలీసు అధికారి వివరించారు.
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోనూ పలు మిల్లుల్లో ఈ దందా నడుస్తోంది.
- మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని మహమూద్‌పట్నం గ్రామ శివారులోని రైస్ మిల్లులో నూకలుగా మరాడించడానికి సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యం ఇవి. ఇటీవల మిల్లులో సోదాలు నిర్వహించి 15 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సంబంధిత అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
లబ్ధిదారుల నుంచి కిలో రూ.10లకు కొనుక్కుని : ఈ వ్యవహారంలో పలువురు రేషన్ డీలర్లు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. రేషన్‌లో ఇచ్చే దొడ్డు బియ్యం అవసరం లేదనుకుంటే, కిలోకు రూ.10 చొప్పున చెల్లించి దళారులు తీసుకుంటున్నారు. ఆ బియ్యాన్ని మిల్లర్లకు కిలోకు రూ.15-18 చొప్పున విక్రయిస్తున్నారు. మిల్లర్లు వాటిని నూకలుగా మార్చి బెవరేజస్ కంపెనీలకు డిమాండ్‌ను బట్టి రూ.25 నుంచి రూ.35 చొప్పున అమ్ముతున్నారు. కొన్నిచోట్ల చౌకధరల దుకాణాల(రేషన్ దుకాణాల) వద్ద కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారనే సమాచారం అందగానే, ఈ దందాలోని వారు అక్కడికి వెళ్లి కిలో రూ.10కి చొప్పున కొనుగోలు చేసి మిల్లర్లకు విక్రయిస్తున్నారు.
PDS Rice Smuggling : కేటుగాళ్ల సరికొత్త పంథా.. మైనర్లతో రేషన్ బియ్యం దందా!