Former CID ASP Vijay pal arrested in RRR Torture Case :వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజును చిత్రహింసలకు గురిచేసిన కేసులో విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్ పాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2021 మే నెలలో సీఐడీ రఘురామను కస్టడీలోకి తీసుకున్నప్పుడు సీఐడీ అదనపు ఎస్పీగా విజయ్ పాల్ ఉన్నారు. కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి, హత్యకు యత్నించారని రఘురామ చేసిన ఫిర్యాదుపై గుంటూరు నగరంపాలెం పోలీసు స్టేషన్‌లో, ఈ ఏడాది జులైలో కేసు నమోదు చేశారు.
ఆ కేసు విచారణలో భాగంగా ఈ ఉదయం 11 గంటలకు విజయ్‌పాల్, ఒంగోలులో ప్రకాశం జిల్లా ఎస్పీ ఎదుట విచారణకు హాజరయ్యారు. సుదీర్ఘ విచారణ తర్వాత విజయ్‌పాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సుప్రీంకోర్టులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం సోమవారమే కొట్టివేసింది.
ఏం జరిగిందంటే :2021లో అప్పటి ఏపీ సీఎం జగన్‌పై రఘురామకృష్ణరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని రఘురామ నివాసం నుంచి ఆయన్ను బలవంతంగా గుంటూరు సీఐడీ రీజనల్ ఆఫీసుకు తరలించారు. ఆ రోజు రాత్రి కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడ్డారని రఘురామ ఈ ఏడాది జులై 11న గుంటూరు నగరంపాలెం ఠాణాలో ఫిర్యాదు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్‌తో పాటు నాటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్, నిఘా విభాగం అధిపతి పీఎస్‌ఆర్ ఆంజనేయులు, సీఐడీ అడిసినల్ ఎస్పీ ఆర్ విజయ్‌పాల్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.