Menthikura Pachadi Recipe : ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరల్లో మెంతికూర ఒకటి. ఈ క్రమంలోనే చాలా మంది దీనితో పప్పు, పచ్చడి ఎక్కువగా చేసుకుంటుంటారు. అయితే, మీరు ఇప్పటి వరకు మెంతికూరతో రకరకాలుగా పచ్చడిని ట్రై చేసి ఉంటారు. కానీ, ఓసారి ఈ స్టైల్లో చేసుకొని చూడండి. వారెవ్వా అనిపించే టేస్ట్‌తో మిమ్మల్ని మైమరిపిస్తోంది. ఇలా చేసి పెడితే మెంతికూర ఇష్టపడని వాళ్లే కాకుండా పిల్లలూ ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే, ఈ పచ్చడి అన్నంలోకి మాత్రమే కాదు టిఫెన్స్లోకి తిన్నా చాలా బాగుంటుంది. మరి, ఈ సూపర్ టేస్టీ అండ్ హెల్దీ పచ్చడికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- మెంతికూర - 1 కట్ట(మీడియం సైజ్ది)
- టమాటాలు - 5
- నూనె - 2 టేబుల్‌స్పూన్లు
- జీలకర్ర - అరటీస్పూన్
- ధనియాలు - ఒకటిన్నర టీస్పూన్
- ఎండుమిర్చి - 5
- పచ్చిమిర్చి - 10 నుంచి 15
- తెల్ల నువ్వులు - 1 టేబుల్‌స్పూన్
- చింతపండు - నిమ్మకాయంత
- పసుపు - పావుటీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 3
- ఉప్పు - రుచికి సరిపడా
తాలింపు కోసం :
- నూనె - 2 టేబుల్‌స్పూన్లు
- పోపు దినుసులు - 1 టేబుల్‌స్పూన్
- కరివేపాకు - కొద్దిగా
- ఎండుమిర్చి - 2
- వెల్లుల్లి రెబ్బలు - 4
- ఇంగువ - చిటికెడు
మినపప్పుతో "రోటి పచ్చడి"! - మీరు ఎన్నడూ టేస్ట్ చేసి ఉండరు!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా మెంతికూరను కాడల నుంచి తుంచుకొని శుభ్రంగా కడగాలి. ఆపై వాటర్ వడకట్టి జల్లిగిన్నెలో వేసి పక్కనుంచాలి. అలాగే, టమాటాలను కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని 1 టేబుల్‌స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక జీలకర్ర, ధనియాలు వేసుకొని లైట్‌గా వేయించుకోవాలి. అవి వేగాక ఎండుమిర్చి, పచ్చిమిర్చిని ముక్కలుగా తుంపి వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి.
- అవీ వేగిన తర్వాత తెల్ల నువ్వులు వేసుకొని మరికాసేపు వేయించాలి. మిశ్రమం మొత్తం చక్కగా వేగిందనుకున్నాక అందులో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న మెంతికూరను యాడ్ చేసుకోవాలి.
- ఆపై మీడియం ఫ్లేమ్ మీద మెంతికూరను బాగా వేయించుకోవాలి. మెంతికూర ఎంత బాగా వేగితే పచ్చడి అంత రుచికరంగా ఉంటుందని, చేదూ ఉండదని గుర్తుంచుకోవాలి.
- మెంతికూర బాగా వేగాక స్టౌ ఆఫ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకొని పక్కనుంచాలి.
- అది చల్లారేలోపు టమాటాలను ఉడికించుకోవాలి. ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, చింతపండు వేసి కలిపి మూతపెట్టాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ మీద టమాటా ముక్కలు బాగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి.
- ఆ విధంగా ఉడికించుకున్నాక మూత తీసి ఒకసారి టమాటా ముక్కలను గరిటెతో మాష్ చేసుకొని పసుపు వేసి కలపాలి. ఆపై అవి గుజ్జుగా మారి, నూనె సెపరేట్ అయ్యేంత వరకు సన్నని సెగ మీద మరికాసేపు ఉడకనివ్వాలి. అలా ఉడికించుకున్నాక స్టౌ ఆఫ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.
- ఇప్పుడు ముందుగా మిక్సీ జార్‌లోకి తీసుకున్న మెంతికూర మిశ్రమంలో వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులో చల్లారిన టమాటా మిశ్రమాన్ని వేసుకొని కలిపి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి.
- ఇప్పుడు తాలింపు కోసం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగాక ఇంగువ, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి తుంపలు, కరివేపాకు వేసి చక్కగా వేయించుకోవాలి.
- ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసుకొని చక్కగా వేగిన తాలింపుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసుకొని మెుత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకుంటే చాలు. అంతే, ఘుమఘుమలాడే "మెంతికూర టమాటా పచ్చడి" రెడీ!
నోరూరించే "క్యాలీఫ్లవర్ పచ్చడి" - ఆవకాయను మించిన టేస్ట్! - సింపుల్‌గా చేసుకోవచ్చు!