Manchu Mohan Babu Family Issue :సీనియర్ నటుడు మోహన్‌బాబుపై కేసు నమోదైంది. మంగళవారం మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు దాడి చేసిన నేపథ్యంలో పహాడీ షరీఫ్ పోలీసులు ఆయనపై బీఎన్‌ఎస్ 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కుటుంబ వివాదం నేపథ్యంలో మంగళవారం జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసానికి మీడియా ప్రతినిధులు వెళ్లారు. మోహన్‌బాబుతో పాటు వచ్చిన బౌన్సర్లు, సహాయకులు గేటు లోపల ఉన్న మీడియా ప్రతినిధులను బయటకు తోసేయడంతో పాటు కర్రలతో దాడి చేశారు. కొద్దిసేపటి వరకు అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఓ ఛానల్ ప్రతినిధి చేతిలో నుంచి మోహన్‌బాబు మైకు లాక్కుని ముఖంపై కొట్టారు.
బౌన్సర్లు నెట్టేయడంతో మరో ఛానల్ కెమెరామెన్ కూడా కింద పడ్డాడు. దీంతో దాడిని నిరసిస్తూ మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులు ధర్నా చేశారు. మోహన్‌బాబుపై కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మోహన్‌బాబుపై పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఘటన అనంతరం మోహన్‌బాబు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి నుంచి మోహన్‌బాబు గచ్చిబౌలిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు గత రెండ్రోజుల నుంచి మంచు కుటుంబంలో జరుగుతున్న వివాదాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
వ్యక్తిగతంగా విచారణకు హాజరవ్వాలని సీపీ ఆదేశాలు :మంగళవారం రాత్రి హైదరాబాద్ శివారు జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసంలోకి జరిగిన ఘటనపై రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచు మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌లు ముగ్గురూ బుధవారం ఉదయం 10.30 గంటలకు తన ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరవ్వాలని రాచకొండ సీపీ ఆదేశించారు. ఈ మేరకు ముగ్గురికి వేర్వేరుగా నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే మోహన్‌బాబు పేరు మీద ఉన్న రెండు లైసెన్డ్ తుపాకీలను స్వాధీనం చేసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు.