CM Revanth Speech in Mahabubnagar Rythu Panduga : ఈ ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని రైతుల కోసం రూ.54 వేల కోట్లు ఖర్చు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైతుల కోసం ఇంకా సొమ్ము అయినా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మహబూబ్నగర్లో రైతు పండుగ ముగింపు వేడుక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. మరోవైపు రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సహా పాలమూరు అభివృద్ధిపై ప్రసంగించారు. నవంబర్ 30వ తేదీకి ఎంతో ప్రత్యేకత ఉందన్న ఆయన, సరిగ్గా ఏడాది క్రితం ప్రజా ప్రభుత్వం కోసం ఉత్సాహంగా ఓట్లు వేసి నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దింపారని అన్నారు.
పాలమూరు జిల్లాలో కృష్ణమ్మ పారుతున్నా జిల్లా ప్రజల కష్టాలు మాత్రం తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రైతులకు ఏం చేసిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని సీఎం వ్యాఖ్యానించారు. వెనుకబడిన మహబూబ్‌నగర్ జిల్లాను అభివృద్ధి చేస్తామంటే, అడుగడుగునా అడ్డుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. రైతు పండుగలో పాల్గొన్న ఆయన, రుణమాఫీ కాని వారి కోసం మరో విడత నిధులు విడుదల చేసినట్లు ప్రకటించారు.
మాయమాటలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దు :లక్ష కోట్లతో పాలమూరు రాత మారుస్తామనన్న రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ పెద్దల మాయలో పడితే జైలు జీవితం గడపాల్సి వస్తుందన్నారు. భూసేకరణను అడ్డుకోవద్దని, పాలమూరు బిడ్డ సీఎంగా ఉండీ.. ఈ జిల్లాను అభివృద్ధి చేయకపోతే చరిత్ర తనను క్షమించదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పదేళ్లు అధికారంలో ఉండి, పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే లక్ష కోట్లు ఖర్చు చేస్తే, ఆ ప్రాజెక్టు కుప్పకూలిపోయిందని విమర్శించారు. మహబూబ్‌నగర్ ప్రాజెక్టులకు నిధులు ఇచ్చేందుకు కేసీఆర్‌కు మనసొప్పలేదని మండిపడ్డారు. ఎవరెవరో వచ్చి మన జిల్లాను దత్తత తీసుకుంటామని అన్నారని వాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు.