2 Lakh Rythu Runa Mafi in Telangana 2024 : ఆగస్టు 15వ తేదీలోగా రూ.2 లక్షలలోపు పంట రుణాలు మాఫీ చేస్తామని లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తాజాగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరుణంలో రుణమాఫీకి సంబంధించిన కసరత్తు మొదలైంది. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై కూడా అధికారులతో రేవంత్ రెడ్డి చర్చించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేయాల్సిందేనని, దానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఎప్పటిలోగా రుణాలు తీసుకున్న వారికి మాఫీ వర్తిస్తుందో ఇప్పటికే వివరాలు ప్రకటించారు. ప్రక్రియకు సంబంధించిన పూర్తిస్థాయి విధివిధానాలను ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సి ఉంది. కుటుంబంలో ఒక రైతుకు పరిమితం చేస్తారా? లేదా ఎంత మంది తీసుకుంటే అంత మందికి మాఫీ వర్తింపజేస్తారా? అనేది తేల్చాలి. ఏప్రిల్ 1, 2019 నుంచి డిసెంబరు 10, 2023 మధ్య రూ.2 లక్షలలోపు రుణాలు తీసుకున్న, రెన్యువల్ చేసుకున్న రైతులకు మాఫీ వర్తిస్తుందని లోగడ ప్రభుత్వం ప్రకటించింది.
రైతులకు గుడ్ న్యూస్ - కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ త్వరలోనే అమలు - Rythu Bharosa Scheme
రైతు రుణమాఫీ దిశగా కసరత్తు :దీని ప్రకారం అర్హులైన వారి జాబితా పంపాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ)లను రాష్ట్ర అధికారులు ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ బ్యాంకులే పెద్ద ఎత్తున పంట రుణాలను మంజూరు చేశాయి. డీసీసీబీ ఖమ్మంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉంది. ఆయా బ్యాంకుల్లో 1.75 లక్షల మంది పంట రుణాలు తీసుకున్నారు.