Virender Sehwag Ex Teammate :భారత క్రికెట్ చరిత్రలో సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వారి సారథ్యంలో ఎందరో యువ క్రికెటర్లు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అయితే కొందరు ఆటగాళ్లు మాత్రం తళుక్కున మెరిసి ఆ తర్వాత కనుమరుగైపోయారు. గంగూలీ, ద్రవిడ్ శకంలో ఎన్నో స్ఫూర్తివంతమైన కథలు నేటి యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తాయి. అయితే వీరందరిలో ఓ క్రికెటర్‌ది మాత్రం భిన్నమైన ప్రయాణం. వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి భారత జట్టుకు ఓపెనర్‌గా సేవలందించిన ఆ క్రికెటర్ ఇప్పుడు బ్యాంకర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
ఎవరా క్రికెటర్?
డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఏ వన్డే సిరీస్‌తో అయితే భారత జట్టులోకి అరంగేట్రం చేశాడో అదే సిరీస్‌లో మరో ఆటగాడు కూడా అరంగేట్రం చేశాడు. అతడే జ్ఞానేంద్ర పాండే. ఎన్నో అంచనాలతో పాండే తన కెరీర్‌ను ప్రారంభించాడు. స్వతహాగా కీపర్ అయిన పాండేను క్రికెట్‌లో ఉజ్వల భవిష్యత్తు ఉన్న క్రీడాకారుడిగా అందరూ అంచనా వేశారు. అయితే కేవలం రెండు వన్డే మ్యాచుల తర్వాత ఈ క్రికెటర్ అంతర్జాతీయ కెరీర్ ఆకస్మికంగా ముగిసిపోయింది. ఇది అభిమానులను, విశ్లేషకులను తీవ్ర విస్మయానికి గురిచేసింది. అయితే అతడి కెరీర్ ఎందుకు ముగిసింది అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉండిపోయింది. కానీ ఒత్తిడికి చిత్తవ్వడంతోనే అతని క్రికెట్ కెరీర్ ముగిసిందన్న వార్తలైతే ఉన్నాయి.
భిన్న మార్గంలో
మారథాన్‌లా మారాల్సిన తన క్రికెట్ కెరీర్ స్ప్రింట్‌లా ముగియడంతో జ్ఞానేంద్ర పాండే కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రస్తుతం బ్యాంక్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. అలా క్రీడల నుంచి ఫైనాన్స్ వైపు అతని ప్రయాణం ప్రారంభమైంది. అయితే ఈ కార్పొరేట్ ప్రపంచంలో పాండే సముచిత స్థానాన్ని దక్కించుకున్నాడు. క్రమశిక్షణ, నైపుణ్యాలతో ఉన్నతస్థాయికి ఎదిగాడు.