BCCI New Secretary : బీసీసీఐ కార్యదర్శి, కోశాధికారి పోస్టుల్లో వారం రోజుల్లోనే కొత్త సభ్యులు ఎంపిక కానున్నారు. జనవరి 12న ముంబయిలో బీసీసీఐ సర్వసభ్య సమావేశం జరగనుంది. అదే రోజు కార్యదర్శి, కోశాధికారి పదవుల భర్తీ కోసం ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికల అధికారిగా మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అచల్‌కుమార్ జ్యోతిని నియమించారు.
అయితే కార్యదర్శి పదవి కోసం దేవ్‌జిత్ సైకియా (అస్సాం) శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈయన బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా ఉన్నారు. ఇక కోశాధికారి పదవి కోసం ప్రభతేజ్ భాటియా (ఛత్తీస్‌గడ్) నామినేషన్ వేశారు. నామినేషన్ల సమర్పణ గడువు శనివారం సాయంత్రమే ముగిసింది. అయితే గడువు ముగిసే సరికి కార్యదర్శి, కోశాధికారి పదవుల కోసం వీరిద్దరే నామినేషన్ వేశారు. దీంతో ఆయా పోస్టులకు ఎన్నిక ఏకగ్రీవం అయినట్లే!
జనవరి 12న కార్యదర్శిగా దేవ్‌జిత్ సైకియా, కోశాధికారిగా ప్రభతేజ్ భాటియా ఎన్నికవడం లాంఛనంగానే కనిపిస్తోంది. కాగా, ఐసీసీ ఛైర్మన్‌గా జై షా, మహారాష్ట్ర మంత్రిగా ఆశిష్ షెలార్ బాధ్యతలు స్వీకరించడం వల్ల బీసీసీఐ కార్యదర్శి, కోశాధికారి పదవులు ఇటీవల ఖాళీ అయ్యాయి.