Rakesh Jhunjhunwala Investment Tips : ఇండియన్ స్టాక్ మార్కెట్లో 'బిగ్ బుల్' రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాది ఒక ప్రత్యేకమైన స్థానం. ఆయన చాలా గొప్ప దూరదృష్టితో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి పెద్ద ఎత్తున లాభాలను సంపాదించారు. ఆయన ఎంతో సహనంతో, క్షుణ్ణంగా పరిశోధన చేసి, కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకునేవారు. అందుకే ఒక సాధారణ ఇన్వెస్టర్ స్థాయి నుంచి 'ది బిగ్ బుల్' స్థాయికి ఎదిగారు. మరి ఆయనలాగే మీరు కూడా స్టాక్ మార్కెట్లో మంచి లాభాలు సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. బిగ్ బుల్ చెప్పిన టాప్-5 టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. దీర్ఘకాల దృష్టితో పెట్టుబడులు : రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడులు పెట్టేవారు. తను అనుకున్న ఫలితాలు వచ్చే వరకు ఎంతో సహనంగా ఉండేవారు. ఆయన టైటాన్ కంపెనీ షేర్లను కొనుగోలు చేసిన విధానాన్ని పరిశీలిస్తే ఈ విషయం మనకు బాగా అర్థమవుతుంది.
రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా 2002-03లో టైటాన్ (Titan Company) షేర్లను కొనుగోలు చేయడం ప్రారంభించారు. అప్పట్లో టైటాన్ షేర్ ధర రూ.3-రూ.4 మాత్రమే ఉండేది. ప్రస్తుతం టైటాన్ షేర్ వాల్యూ రూ.3,400 వరకు ఉంది. వాస్తవానికి 2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చింది. అలాంటి క్లిష్టపరిస్థితుల్లోనూ రాకేశ్ టైటాన్ షేర్లను అమ్మలేదు. పైగా 2012లో తన స్టేక్‌ను 10.28 శాతానికి పెంచుకున్నారు. ప్రస్తుతం టైటాన్‌లో 5.05 శాతం స్టేక్ రాకేశ్, రేఖా ఝున్‌ఝున్‌వాలా జాయింట్ అకౌంట్‌లో ఉన్నాయి. దీని విలువ సుమారుగా రూ.11,081 కోట్లు ఉంటుంది. ఇది రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు ఉన్న దూరదృష్టిని, సహనాన్ని మనకు తెలియజేస్తుంది.
2. సమగ్ర పరిశోధన : రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఏదైనా స్టాక్‌లో పెట్టుబడులు పెట్టేముందు డీప్ రీసెర్చ్ (సమగ్ర పరిశోధన) చేసేవారు. ఇందుకు ఉదాహరణగా 'లుపిన్' (Luin) స్టాక్‌ను తీసుకోవచ్చు.
బిగ్ బుల్ పోర్ట్‌ఫోలియోలోని ముఖ్యమైన స్టాక్స్‌లో లుపిన్ ఒకటి. దీని ద్వారా రాకేశ్ చాలా లాభం పొందారు. 2023లో రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఈ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించారు. అప్పుడు ఆయన స్టేక్ వాల్యూ సుమారుగా రూ.500 కోట్లు. అయితే 2008 నాటికి లుపిన్‌లో ఆయన స్టేక్ 4.29 శాతానికి తగ్గింది. అప్పుడు దాని మొత్తం విలువ రూ.154 కోట్లు మాత్రమే. ఇలా ఆయన క్రమంగా లుపిన్ నుంచి తన పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే లుపిన్ షేర్ వాల్యూ రూ.1,100కు చేరిందో, వెంటనే తన దగ్గర ఉన్న షేర్లు అన్నీ అమ్మేసి గొప్ప లాభాలను మూటగట్టుకున్నారు. దీనికంతటికీ ఆయన చేసిన డీప్ రీసెర్చే కారణం. లుపిన్ ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరిస్తోంది? భవిష్యత్‌లో ఎలాంటి ప్రొడక్టులు తీసుకువస్తుంది? ప్రస్తుతం కంపెనీ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇలాంటివన్నీ సమగ్రంగా పరిశీలించి, తగు సమయంలో ఆ కంపెనీ షేర్లను పూర్తిగా వదిలించుకుని, గొప్ప లాభాలను పొందారు.
3. నమ్మకం, సహనం : 2008 ఆర్థిక మాంద్యం సమయంలో రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా తన పెట్టుబడి వ్యూహాలపై నమ్మకంతో, చాలా సహనంగా వ్యవహరించారు. క్రిసిల్ (Crisil) షేర్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనైనప్పటికీ వాటిని అమ్మకుండా, అలాగే తన పోర్ట్‌ఫోలియోలో ఉంచుకున్నారు. వాస్తవానికి 2003లో 10,000 క్రిసిల్ షేర్లను మొదటిసారి కొన్నారు. 2006 నాటికి తన హోల్డింగ్స్‌ను ఏకంగా 5.5 మిలియన్ షేర్లకు పెంచుకున్నారు. ఆయన ఆ షేర్లను రూ.400-రూ.500 ప్రైస్ రేంజ్‌లో కొన్నారు. 2013లో రేఖా ఝున్‌ఝున్‌వాలా తమ దగ్గరున్న వాటిలో ఏకంగా 4 లక్షల షేర్లను అమ్మేసి రూ.46 కోట్లను సంపాదించారు. ఇంకా ఆమె దగ్గర 5.48 శాతం క్రిసిల్ షేర్లు ఉన్నాయి. ప్రస్తుతం వాటి విలువ సుమారుగా రూ.1,322 కోట్లు ఉంటుంది.
4. కాలిక్యులేటెడ్ రిస్క్ : స్టాక్ మార్కెట్లో కొన్నిసార్లు రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అది కచ్చితంగా కాలిక్యులేడ్ రిస్క్ అయ్యుండాలి. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఎప్పుడూ దీనిని అనుసరించేవారు. ఆయన వైస్రాయ్ హోటల్స్ (Viceroy Hotels) షేర్లను రిస్క్ తీసుకుని కొన్నానని చెబుతుండేవారు.
2015లో రాకేశ్ వైస్రాయ్ హోటల్స్ షేర్లను (1.18 శాతం స్టేక్) కొనడం ప్రారంభించారు. 2016 సెప్టెంబర్ నాటికి తన స్టేక్‌ను 13.46 శాతానికి పెంచుకున్నారు. కానీ 2018 నాటికి తన మొత్తం స్టేక్‌ను 1 శాతం కంటే దిగువకు తగ్గించుకున్నారు. ఇలా చేసిన కొంత కాలం తరువాత సదరు కంపెనీ బీఎస్‌ఈ, ఎన్‌సీఈల్లో అదనపు నిఘా చర్యల (ASM) జాబితాలోకి వెళ్లిపోయింది. దీనిని బట్టి రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఎంత గొప్పగా కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకునేవారో అర్థం చేసుకోవచ్చు.
5. గ్రోత్ పొటెన్షియల్ : ఒక కంపెనీ భవిష్యత్‌లో ఎంత గొప్పగా అభివృద్ధి చెందగలదో, దాని గ్రోత్ పొటెన్షియల్ ఎలా ఉందో రాకేశ్ ఊహించగలిగేవారు. ఉదాహరణకు ఆయన Aptech అనే ఎడ్యుకేషన్ కంపెనీలో షేర్లు కొన్నారు. భారతదేశంలో విద్యా సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను ఆయన ముందుగానే పసిగట్టారు. దీని ద్వారా కూడా ఆయన గొప్ప లాభాలు సంపాదించారు.
నోట్ : ఈ ఆర్టికల్‌లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్లు చాలా రిస్క్‌తో కూడికొని ఉంటాయి. కనుక కీలక పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కచ్చితంగా మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.
వారన్ బఫెట్ 12 గోల్డన్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ - ఇవి పాటిస్తే లాభాల వర్షం గ్యారెంటీ!
స్మాల్ క్యాప్ Vs మిడ్ క్యాప్ Vs లార్జ్ క్యాప్ స్టాక్స్ - వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్?