Special Incentive Scheme in Singareni : సింగరేణి సంస్థ నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాలను అధిగమించేందుకు స్పెషల్ ఇన్సెంటివ్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ నెల ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు రెండు నెలల పాటు ఈ పథకం అమలు ఉంటుందని పేర్కొంది. సంస్థ 11 ఏరియాలలోని భూగర్భ, ఉపరితల గనులతోపాటు బొగ్గు రవాణా చేసే సీహెచ్‌పీల్లో పనిచేసే కార్మికులందరికీ ఈ పథకం వర్తింపజేయనున్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. 2024 ఏప్రిల్ నుంచి 2025 జనవరి 31 నాటికి నిర్దేశిత లక్ష్యం 57.59 మిలియన్ టన్నులకు గాను 53.73 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించింది. ఇప్పటి వరకు ఏర్పడిన 3.86 మిలియన్ టన్నుల లోటును భర్తీ చేయడంతోపాటు ఫిబ్రవరి, మార్చి నెలల్లో 18.27 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాల్సి ఉంది.
బొగ్గు ఉత్పత్తి, రవాణా ఆధారంగానే ప్రోత్సాహకం : ప్రోత్సాహకాలను కార్మికులు అందుకోవాలంటే తప్పనిసరిగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రతి నెలా 22 మస్టర్లు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. నెలకు 20వేల టన్నుల కంటే ఎక్కువగా బొగ్గు ఉత్పత్తి లక్ష్యం ఉన్న భూగర్భ గనులను ఒకటో కేటగిరీగా, అంతకంటే తక్కువగా ఉండే గనులను రెండో కేటగిరీగా విభజించారు. వీటితోపాటు ఉపరితల గనులు, సీహెచ్‌పీ, సీఎస్‌పీలను రెండు కేటగిరీలుగా విభజించి బొగ్గు ఉత్పత్తి, రవాణా ఆధారంగా నగదు ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్లు తెలిపారు.
రెండు కేటగిరీలుగా విభజన : స్పెషల్ ఇన్సెంటివ్ పథకాన్ని అధికారులు రెండు కేటగిరీలుగా విభజించారు. మొదటి కేటగిరీలో ప్రొడక్షన్లో ఏరియా లక్ష్యం సాధిస్తే, రెండో కేటగిరీలో గని లక్ష్యాన్ని అధిగమిస్తే ఆ కార్మికులకు నగదు పారితోషికాలు అందుతాయి.
- మొదటి కేటగిరీలో భాగంగా 100 నుంచి 104 శాతం వరకు ఉత్పత్తి సాధిస్తే రూ.1500, 105 నుంచి 109 శాతం వరకు సాధిస్తే రూ.2000, ఇంకా 110 శాతం కంటే ఎక్కువగా సాధిస్తే రూ.2,500 ఇన్సెంటివ్‌లను అందజేస్తారు.
- రెండో కేటగిరీలోనూ 100 నుంచి 104 శాతం ఉత్పత్తి సాధిస్తే రూ.1,200, 105 నుంచి 109 శాతం సాధిస్తే రూ.1,700, 110 శాతాన్ని అధిగమించి సాధిస్తే రూ.2,200 కార్మికులకు ఇస్తారు. మిగతా ఏ కారణాలతోనైనా విధులకు గైర్హాజరైన వారిని మాత్రం పరిగణనలోకి తీసుకోరు.
ప్రత్యేక ప్రోత్సాహాకాల పథకంలో భాగంగా ప్రతి నెలలో కార్మికుడు 22 మస్టర్లు తప్పనిసరిగా నిండి ఉండాలి. బెల్లంపల్లి ఏరియా ఖైరిగూర ఓసీపీ, గోలేటి సీహెచ్‌పీలు రెండో కేటగిరిలోనే ఉన్నాయి. కార్మికులు రక్షణతో కూడిన విధులు నిర్వహించి ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించేందుకు కృషి చేస్తే ప్రోత్సాహకాలు వారికి తప్పకుండా అందుతాయి. -ఎం.శ్రీనివాస్, జీఎం బెల్లంపల్లి ఏరియా
పదవీ విరమణ చేసిన సింగరేణి కార్మికులకు బోనస్ - ఒక్కొక్కరికి ఎంతంటే?