Pil Filed In Telangana High Court On Metro Rail Expansion In Hyderabad : హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణపై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. పాతబస్తీలో మెట్రో నిర్మాణంపై ఏపీడబ్ల్యూఎఫ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షుడు మహ్మద్ రహీం ఖాన్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుంచి చంద్రాయణ్‌గుట్ట వరకు చేపడుతున్న మెట్రో రైలు నిర్మాణం వల్ల చారిత్రక కట్టడాలకు ముప్పు ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. మెట్రో మార్గానికి సమీపంలో చార్మినర్, ఫలక్‌నూమా ప్యాలెస్‌తో పాటు పురానా హవేలీ, మొఘల్‌పుర సమాధుల వంటి చారిత్రక కట్టడాలున్నాయని ఆయన తెలిపారు. తెలంగాణ హరిటేజ్ చట్టం 2017 ప్రకారం చారిత్రక కట్టడాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. మెట్రో రైలు నిర్మాణ పనులను ఆపేలా ఆదేశాలివ్వాలని మహ్మద్ రహీంఖాన్ ప్రజాప్రయోజన వ్యాజ్యంలో కోరారు.
మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని, చారిత్రక కట్టడాలను పరిరక్షించడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారో నివేదిక సమర్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటీషనర్ కోరారు. హైకోర్టు లేదా నిపుణుల కమిటీ ఆమోదం తర్వాత మెట్రో రైలు పనులు ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేయాలని మహ్మద్ రహీం తన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, మెట్రో రైలు ఎండీ, వక్ఫ్‌బోర్డు సీఈఓను ప్రతివాదులుగా చేర్చారు. ప్రతివాదులకు పిటీషనర్ తరఫు న్యాయవాది వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేశారు. ఈ పిటీషన్‌పై విచారణను సీజే ధర్మాసనం 17వ తేదీకి వాయిదా వేసింది.
రహదారి విస్తరణ పనుల ప్రక్రియ : పాతబస్తీలో మెట్రో మార్గంలో రహదారి విస్తరణకు ఆస్తుల సేకరణ మొదలైంది. గజానికి రూ.81 వేలను పరిహారంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నిర్ణయించారని డిసెంబర్లో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ముందుకొచ్చే నిర్వాసితులకు త్వరలోనే పరిహారం కింద చెక్కులు అందజేస్తామని చెప్పారు. ఆస్తుల కూల్చివేత, రహదారి విస్తరణ పనుల ప్రక్రియ మొదలుపెడతామని వివరించారు.
గజానికి రూ.81 వేల పరిహారం - పాతబస్తీ మెట్రోకు ఆస్తుల సేకరణ షురూ