Three Died in Road Accident at Medchal Checkpost : మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే, మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులతో పాటు కుమార్తె మృతి చెందింది. కుమారుడి కాళ్లపై నుంచి లారీ వెళ్లింది. దీంతో ఆ బాలుడి రెండు కాళ్లు విరిగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని సమీప ఆసుపత్రికి తరలించారు.
ఏపీలోని కాకినాడకు చెందిన సాగి బుల్లబ్బాయ్ ( 37) కుటుంబం హైదరాబాద్ ఉప్పల్‌లో నివాసముంటోంది. ఉదయం పూట బండిపై టిఫిన్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. బంధువుల ఇంటికి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బైకుపై వెళ్తుండగా మేడ్చల్ చెక్‌పోస్ట్ సమీపంలో వెనక నుంచి అతి వేగంగా వస్తున్న ఓ కంటైనర్ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో బుల్లబ్బాయ్ సహా అతని భార్య సాగి లావణ్య (32), కుమార్తె సాగి హర్షిత దేవి (8) అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు సాగి సిద్ధేశ్వర్ (6) కాలిపై నుంచి లారీ దూసుకెళ్లడంతో ఆ బాలుడి రెండు కాళ్లు విరిగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని సమీప ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలం నుంచి లారీ డ్రైవర్ పరారయ్యాడు.
కేసు ప్రాథమిక దర్యాప్తులో మృతులు ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మేడ్చల్ ఎల్లంపేటలో ఉంటున్న వారి బంధువులను పరామర్శించేందుకు ఈరోజు మధ్యాహ్నం ఉప్పల్ నుంచి తన ద్విచక్ర వాహనంపై మేడ్చల్ వస్తుండగా చెక్ పోస్ట్ వద్ద అతి వేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ వస్తున్న నాగాలాండ్‌కు చెందిన కంటైనర్ లారీ వెనక నుంచి వీరి బండిని ఢీకొట్టింది. ప్రమాదంలో దంపతులు సహా కుమార్తె, మృతి చెందగా కుమారుడి కాలిపై నుంచి లారీ దూసుకెళ్లింది. ఆ బాబును ఆసుపత్రికి తరలించగా అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న మేడ్చల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
VIRAL VIDEO : యూటర్న్ తీసుకునేటప్పుడు జాగ్రత్త - లేదంటే మీకూ ఇలాగే జరుగుతుంది!
నలుగురి ప్రాణాలను బలిగొన్న ఆటోల ఛేజింగ్ - మృతుల్లో ఇటీవలే ఉద్యోగం సాధించిన అసిస్టెంట్ ఇంజినీర్