Prasidh Krishna Border Gavaskar Trophy : ఆసీస్- భారత్ మధ్య జరిగిన ఐదో టెస్టులో టీమ్ఇండియా యంగ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ అరుదైన ఫీట్ సాధించాడు. టెస్టు కెరీర్లో 9999 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్, 10 వేల మార్కును అందుకోవడానికి 1 పరుగు దూరంలో ప్రసిద్ధ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ బ్యాటర్ ని 9,999 పరుగుల వద్ద ఔట్ చేసిన మొట్టమొదటి బౌలర్‌గా నిలిచాడు ప్రసిధ్ కృష్ణ.
మొదటి బౌలర్‌గా
అంతకుముందు శ్రీలంక మాజీ బ్యాటర్ మహేల జయవర్ధనే కూడా 9,999 వద్ద ఔట్ అయ్యాడు. అయితే అతను సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో జాక్వస్ కలీస్ చేతిలో రనౌట్ అయ్యాడు. గతంలో విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా 9,990- 10వేల పరుగుల మధ్య రెండు సార్లు ఔట్ అయ్యాడు. 2004లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో లారా 9,993 టెస్టు పరుగుల వద్ద రెండు సార్లు పెవిలియన్‌కు చేరాడు.
ఒక్క పరుగు దూరంలో 10వేల మార్క్
ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 10 వేల టెస్టు పరుగుల మార్కును అందుకోవడానికి శ్రీలంకతో సిరీస్ దాకా వేచి చూడాల్సిందే. శ్రీలంకతో జరగబోయే సిరీస్‌లో స్మిత్ ఒక రన్ చేస్తే టెస్టుల్లో 10వేల క్లబ్లో చేరిపోతాడు. ఈ క్రమంలో రికీ పాంటింగ్, అలన్ బోర్డర్, స్టీవ్ వా తర్వాత 10వేల టెస్టు పరుగులు చేసిన నాలుగో ఆసీస్ బ్యాటర్‌గా నిలుస్తాడు.
అదరగొట్టిన స్టీవ్ స్మిత్
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో మొదటి మూడు ఇన్సింగ్స్ లో స్టీవ్ స్మిత్ 19 పరుగులే చేశాడు. ఆ తర్వాత పుంజుకుని బ్రిస్బేన్ టెస్టులో సెంచరీ (104) బాదాడు. అలాగే మెల్బోర్న్ టెస్టులో మరో శతకం (140) పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా జరిగిన మ్యాచ్‌లో 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ప్రసిధ్ కృష్ణ ఓవర్లో స్లీప్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు స్టీవ్ స్మిత్. దీంతో టెస్టుల్లో 10 వేల పరుగుల మార్క్‌కు ఒక రన్ దూరంలో నిలిచిపోయాడు.
సిరీస్‌ను గెలిచిన ఆసీస్
కాగా, సిడ్నీ వేదికగా జరిగిన ఐదో టెస్టులో ఆసీస్ విజయం సాధించింది. భారత్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో 3-1 తేడాతో ఐదు టెస్టుల సిరీస్‌ను చేజిక్కుంచుకుంది. దీంతో వరుసగా రెండోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు ఆస్ట్రేలియా చేరుకుంది. ఈ ఓటమితో భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది.
10 ఏళ్ల తర్వాత భారత్‌కు ఘోర పరాజయం - గావస్కర్ ట్రోఫీ ఆసీస్‌దే
ఆసీస్ ఫ్యాన్స్‌కు విరాట్ కోహ్లీ కౌంటర్ - ఆ ఒక్క సైగతో అందరూ షాకయ్యారుగా!