Bhuvan Survey in Telangana : రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఆస్తుల వివరాలను కచ్చితంగా నమోదు చేసేందుకు గతంలో చేపట్టి ఆగిపోయిన భువన్ సర్వేను అధికారులు మళ్లీ మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే దాదాపు మూడొంతుల సర్వే పూర్తికాగా మిగతాది కూడా పూర్తిచేయాలని భావిస్తున్నారు. సర్వేలో భాగంగా ఉపగ్రహ ఆధారిత ఫోటోలు తీయడంతోపాటు క్షేత్రస్థాయిలో సిబ్బంది పర్యటించి ఆయా ఆస్తుల పరిస్థితులను నమోదు చేస్తారు. వాటి వాస్తవ విస్తీర్ణాన్ని గుర్తించి తదనుగుణంగా ట్యాక్స్ విధిస్తారు. ప్రతి ఆస్తికి 10 అంకెల ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ (పీటిన్)ను కేటాయించనున్నారు.
అవకతవకలకు అడ్డుకట్ట : రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలు ఏటా దాదాపు రూ.900 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్నాయి. అయితే పన్ను విధింపులో అనేక రకాలుగా అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. పలు ప్రాంతాల్లో యజమానులు స్థానిక సిబ్బందితో కుమ్మక్కై ఆస్తి విలువ తక్కువగా చూపించి తక్కువ పన్ను చెల్లిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అలాగే కమర్షియల్ పరమైన ఆస్తిని నివాసగృహంగా చూపించి కూడా పన్ను మతలబులు చేస్తున్నారు. ఇలాంటి అవకతవకలకు చెక్ పెట్టే ఉద్దేశంతోనే ప్రతి ఆస్తిని సాటిలైట్ ఆధారిత మ్యాపింగ్ చేయాలని తలపెట్టారు. 2020లోనే లాంఛనంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) మినహా రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వేను ప్రారంభించారు. అనంతరం కరోనా కారణంగా దాదాపు రెండేళ్లపాటు ఈ ప్రక్రియ నిలిచిపోయింది.
ఆస్తి పన్ను మదింపు చేయాలనే : రాష్ట్రంలో దాదాపు 20 లక్షల గృహాలను ఇలా మ్యాపింగ్ చేయాలని అధికారులు తలపెట్టారు. 2023లో సర్వే తిరిగి ప్రారంభమైనప్పటికీ తర్వాత వరుసగా వచ్చిన ఎన్నికల కారణంగా మళ్లీ అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు మిగతా సర్వేను త్వరగా పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. రానున్న నాలుగైదు నెలల్లో ఈ భువన్ సర్వేను పూర్తిచేసి ఆస్తి పన్ను మదింపు చేయాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమం వల్ల ప్రజలకు కూడా మేలు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. తమ ఆస్తికి సంబంధించి కచ్చితంగా పన్ను చెల్లించే వెసులుబాటు ఉంటుందని ఆ ఆస్తిపై హక్కు ఎవరిదీ అనేది కచ్చితత్వంతో తెలుస్తుందని వివరించారు. అన్నింటికీ మించి అవకతవకలను నిరోధించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆస్తిపన్నుతో వసూళ్లను పెంచే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టారు. సర్వే విజయవంతంగా పూర్తయితే ఆయా పట్టణ స్థానిక సంస్థల్లో రోడ్లు, డ్రైనేజీలు వంటివాటిని కూడా మెరుగుపరిచే అవకాశం సులభంగా అవుతుంది.
తెలంగాణలో డిజిటల్ పంటల సర్వే - ఆదిలోనే సమస్యలు మొదలు
2025లో జీతాలు 9.4శాతం పెరిగే ఛాన్స్ - అందరికన్నా ఆ ఉద్యోగులకే ఎక్కువ హైక్!