Pregnant Pushed From Moving Train : తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి తిరుపతికి వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ మహిళల ప్రత్యేక బోగీలోకి ఎక్కిన ఓ వ్యక్తి అమానుషంగా ప్రవర్తించాడు. నాలుగు నెలల గర్భిణీపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నడుస్తున్న రైలులో నుంచి ఆమెను కిందకు నెట్టేశాడు.
వివరాల్లోకి వెళితే-- గురువారం రాత్రి 9 గంటలకు తమిళనాడులోని జోలార్ పెట్టై రైల్వేస్టేషన్‌లో కోయంబత్తూరు-తిరుపతి ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లోకి ఓ యువకుడు ఎక్కాడు. అయితే అతడు ఎక్కింది మహిళల ప్రత్యేక బోగీలోకి. "మహిళల బోగీలోకి ఎందుకు ఎక్కావు?" అని సదరు వ్యక్తిని ఓ గర్భిణీ ప్రశ్నించింది. దీంతో ఆ వ్యక్తికి, గర్భిణీకి మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి ఆమెపై దాడి చేశాడు.
అనంతరం ఆ మహిళ బాత్రూమ్కు వెళ్లగా వెంబడించాడు. చివరకు బోగీలోని తలుపు వద్ద నిలబడి గర్భిణీతో మరోసారి వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత ఆమెపై లైంగిక వేధింపులకు తెగబడ్డాడు. సదరు మహిళ అరుస్తున్నా లైంగిక వేధింపులు ఆపలేదు. చివరకు ఆమెను కదులుతున్న రైలు నుంచి బయటకు నెట్టేశాడు. కేవీ కుప్పం స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. దీన్ని గుర్తించిన తోటి రైలు ప్రయాణికులు- ఆ మహిళను రక్షించారు.
తోటి రైలు ప్రయాణికుల సహాయం
కేవీ కుప్పం పోలీసులకు, అత్యవసర వైద్యసేవల విభాగానికి రైలు ప్రయాణికులు సమాచారాన్ని అందించారు. వెంటనే అంబులెన్సులో బాధిత మహిళను ప్రాథమిక చికిత్స కోసం కేవీ కుప్పం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం వేలూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి పంపించారు. ఆ గర్భిణిీ కాళ్లు, చేతులకు గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. గర్భిణీ కావడం వల్ల కొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని సూచించారు.
కాట్పాడి రైల్వే పోలీసుల అదుపులో నిందితుడు
గర్భిణీపై దాడికి పాల్పడిన వ్యక్తిని హేమరాజ్‌గా పోలీసులు గుర్తించారు. గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడ్డాడని తెలిపారు. సెల్ ఫోన్ల చోరీ, రైలు ప్రయాణికులపై లైంగిక వేధింపుల కేసులు ఇంతకు మునుపు కూడా హేమరాజ్‌పై నమోదైనట్లు చెప్పారు. ప్రస్తుతం హేమరాజ్ తమిళనాడులోని కాట్పాడి రైల్వే పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేవీ కుప్పం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిపై హత్యాయత్నం, లైంగిక వేధింపులకు సంబంధించిన సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. మద్యం, డ్రగ్స్ మత్తులో అతడు ఇలా చేశాడా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.