How to Apply for PM Surya Ghar Yojana : దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే ప్రధానమంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజలీ యోజన. 2027 మార్చి నాటికి కోటి కుటుంబాలకు సౌర విద్యుత్తు సరఫరా చేయాలనే లక్ష్యంతో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్. ఈ సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ కూడా అందిస్తోంది. ఇంతకీ ఈ పథకం కింద రాయితీ ఎంత? ఎలా అప్లై చేసుకోవాలో పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం రాయితీ కింద ఒక్కో కిలోవాట్‌కు రూ.30వేలు సబ్సిడీని కేంద్రం అందిస్తుంది. రెండు కిలోవాట్లకు రూ.60 వేలు, 3 కిలోవాట్లకు అయితే రూ.78 వేలు సబ్సిడీ లభిస్తుంది. అంటే మూడు కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయడానికి రూ.1.45 లక్షలు ఖర్చయితే అందులో కేంద్రం గరిష్ఠంగా రూ.78 వేలు భరిస్తుంది. మిగిలిన మొత్తాన్ని ష్యూరిటీ అవసరం లేకుండా తక్కువ వడ్డీకే బ్యాంకుల నుంచి లోన్స్ పొందొచ్చు.
కెపాసిటీ ఎంత: సూర్యఘర్ వెబ్‌సైట్ ప్రకారం, నెలకు 0-150 యూనిట్ల విద్యుత్ ఉపయోగించే వారికి 1-2 కిలోవాట్ల రూఫ్‌టాప్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఇక 150-300 యూనిట్లు చొప్పున వినియోగించే వారు 2-3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. 300 యూనిట్లకు పైబడి విద్యుత్‌ను వినియోగించే వారు 3 కిలోవాట్ లేదా ఆ పైన సామర్థ్యం కలిగిన సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి.
ఆదా ఎంత?: సూర్యఘర్ వెబ్‌సైట్ ప్రకారం, 1 కిలోవాట్‌కు సుమారు 120 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అంటే ప్రస్తుత వినియోగం ప్రకారం నెలకు రూ.1000 విద్యుత్ బిల్లు వస్తుంది. అదే సోలార్ ఏర్పాటు వల్ల అయ్యే ఖర్చు రూ.338 మాత్రమే అవుతుంది. దీంతో ఏటా రూ.8వేలు ఆదా అవుతుంది.
దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే:
- ముందుగా పీఎం సూర్యఘర్ పోర్టల్‌లో పేరును రిజిస్టర్ చేసుకోవాలి. ఇందుకోసం పీఎం సూర్యఘర్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో Quick Links కాలమ్‌లో Apply for Rooftop Solar ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- Register Here ఆప్షన్‌పై క్లిక్ చేసి మీ రాష్ట్రం, జిల్లా, విద్యుత్ సరఫరా చేసే కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆపై మీ విద్యుత్ కనెక్షన్ కన్జ్యూమర్ నంబరు, క్యాప్చా ఎంటర్ చేసి Next ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి Send OTP ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసి, ఆ తర్వాత ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేయాలి. చివరగా క్యాప్చా ఎంటర్ చేసి ప్రొసీడ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత లాగిన్ సెక్షన్లోకి వెళ్లి కన్జ్యూమర్ నంబర్, మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. అక్కడ ‘రూఫ్‌టాప్ సోలార్’ కోసం అప్లయ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ పూర్తి చేసి డిస్కమ్ నుంచి పర్మిషన్ వచ్చేవరకు వెయిట్ చేయాలి. అనుమతి వచ్చిన తర్వాత మీ డిస్కమ్‌లోని నమోదిత విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
- ఇన్‌స్టలేషన్ పూర్తయిన తర్వాత, ఆ ప్లాంట్ వివరాలను పోర్టల్‌లో సబ్మిట్ చేసి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
- నెట్ మీటర్‌ను ఇన్‌స్టాల్ చేశాక, డిస్కమ్ అధికారులు ఎంక్వైరీ చేస్తారు. అనంతరం పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికెట్ ఇస్తారు.
- ఈ రిపోర్ట్ పొందిన తర్వాత మీ బ్యాంకు ఖాతా వివరాలతోపాటు క్యాన్సిల్డ్ చెక్‌ను పోర్టల్‌లో సబ్మిట్ చేయాలి. 30 రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది.
పాస్‌పోర్టుకు అప్లై చేస్తున్నారా? - ఈ మిస్టేక్స్ ముందే చెక్ చేసుకోవడం బెటర్
మీరు ఉద్యాన పంటలు పండిస్తున్నారా? - అయితే మీకు రాయితీలు ఇచ్చే పథకం ఇదిగో?