Green Food Health Benefits : ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల 30 ఏళ్లకే రక్తపోటు, నడి వయసులోనే గుండెపోటు వస్తున్నాయి. చిన్న వయసులోనే ఇన్‌ఫెక్షన్లు, ఇన్‌ఫ్లమేషన్లు, క్యాన్సర్లు కమ్ముకుంటున్న నేపథ్యంలో వీటికి ఆకుపచ్చని ఆహారమే మంచి ఔషధమని నిపుణులు తేల్చారు. ముఖ్యంగా మెరుగైన జీవక్రియకు మొక్కల నుంచి వచ్చిన పదార్థాలు మేలని కింగ్స్ కాలేజ్, లండన్ పరిశోధనలో వెల్లడైంది. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకునే వారిలో మంచి సూక్ష్మ అణువులు వృద్ధి చెందుతాయని తెలిపారు. ఫలితంగా వారి ఆరోగ్యం, ఆయుష్షు పెరుగుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
విటమిన్లు, మినరల్స్
మన ఆరోగ్యం పది కాలాల పాటు పచ్చగా ఉండాలంటే ఆకుపచ్చని ఆహారం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. తరచూ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో పాటు చిరుధాన్యాలు తీసుకునే వారిలో జీవక్రియలు మెరుగవుతాయని అంటున్నారు. వాటిలో సమృద్ధిగా ఉండే ఆరోగ్యకర సూక్ష్మ అణువులు (మెటబొలైట్స్) ప్రమాదకరమైన ఇన్‌ఫెక్షన్లు, ఇన్‌ఫ్లమేషన్లు, క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడతాయని కింగ్స్ కాలేజ్, లండన్ పరిశోధకులు కనిపెట్టారు. ఇంకా శాకాహారం వల్ల ప్రయోజనాలపై వారి పరిశోధనా పత్రం యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషియన్‌లో ప్రచురితమైంది.
![Green Food Health Benefits](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-02-2025/23525806_green_food_health_benefits-2.jpg)
అధ్యయనం ఏం చెబుతోంది?
ఆరోగ్యంగా ఉన్న 200 మంది పెద్దవాళ్లను తీసుకుని.. వాళ్లు ఏ ఆహారాన్ని తీసుకుంటున్నారనే విషయాన్ని తెలుసుకున్నారు. మరోవైపు 100 రకాల మొక్కల నుంచి వచ్చిన ఆహారానికి సంబంధించిన సూక్ష్మ అణువులను గుర్తించారు. ఇవి ఆరోగ్యవంతుడిలో ఎంత శాతం ఉండాలనేది నిర్ధరించి.. వారి రక్త, మూత్ర పరీక్షల్లో సూక్ష్మ అణువులు ఏ మేరకు ఉన్నాయనేది పరీక్షించారు. అయితే, సూక్ష్మ అణువులు తక్కువగా ఉన్నాయని తేలిన వారు పైకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా జీవక్రియ మెరుగ్గా లేదని గుర్తించారు. వారికి భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని.. మొక్కల నుంచి వచ్చే ఆహారాన్ని ఎక్కువగా తినాలని సలహా ఇచ్చారు.
పోషకాహారం రెండు రకాలు
1.సూక్ష్మ పోషకాలు: విటమిన్లు, ఖనిజ లవణాలు
2. స్థూల పోషకాలు: పిండిపదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు
మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందేందుకు రెండూ అవసరం ఉంటాయి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాల వల్ల రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా సూక్ష్మ పోషకాలలో పీచు ఎక్కువగా లభిస్తుంది. ఇంకా విటమిన్ ఏ, ఈ, ఫోలిక్ యాసిడ్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటివీ ఉంటాయి.
ఖనిజ లవణాలు అన్ని రకాల గింజ ధాన్యాలు, పప్పు దినుసులు, సోయాబీన్, గడ్డి విత్తనాలు, పుచ్చకాయ విత్తనాలు, గుమ్మడి విత్తనాలు, వాల్‌నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాల్లో పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్.. వాల్‌నట్స్, గుమ్మడి, పుచ్చ, పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఎక్కువగా ఉంటాయి.
విటమిన్ ఎ: ఇది యాంటీ జెన్, యాంటీ బాడీస్ పనిచేయడానికి దోహదం చేస్తుంది. నోరు, జీర్ణాశయం, పేగులు, శ్వాసకోశ వ్యవస్థను, చర్మ కణజాలాన్ని కాపాడుతుంది. క్యారెట్, బీట్‌రూట్, కీరదోస, చిలగడదుంప, మామిడి, బొప్పాయి, యాప్రికాట్స్, పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటుంది.
విటమిన్ ఇ: మన శరీరంలోని కణం ఆకృతి చక్కగా ఉండేలా చూస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్లుగా, ముఖ్యంగా వృద్ధుల్లో రోగ నిరోధకతను పెంచేందుకు సహాయ పడుతుంది. శనగలు, కరివేపాకు, పసుపు, ఎండుకొబ్బరి, పొద్దు తిరుగుడు, అవిసె గింజలు, బాదం, పిస్తాల్లో పుష్కలంగా లభిస్తుంది.
విటమిన్ సి: ఇది కణాల మరమ్మతుకు, పునరుత్పత్తికి బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా యాంటీబాడీస్‌ను ప్రేరేపిస్తుంది. అన్ని రకాల ఆకుపచ్చని కూరగాయలు, దేశీయ జామ, దానిమ్మ, పచ్చిమామిడి, నిమ్మ, ద్రాక్ష తదితర పుల్లని పండ్లతో పాటు బొప్పాయి, ఎర్రతోటకూర, స్ట్రాబెర్రీ, క్యాప్సికమ్‌లలో ఎక్కువగా ఉంటుంది.
ప్రొటీన్లు: ఇవి మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా మార్చుతాయి. వ్యాధుల నుంచి త్వరగా కోలుకునేలా దోహదపడతాయి. సోయా ఉత్పత్తులు, ఉప్పు కలపని గింజలు, బీన్స్, పప్పు దినుసుల్లో అధికంగా లభిస్తాయి.
![Green Food Health Benefits](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-02-2025/23525806_green_food_health_benefits-1.jpg)
"అనేక వ్యాధులకు పేగుల్లోని సూక్ష్మక్రిములే (మైక్రోబయోమ్) మూలకారణం. నిజానికి పేగుల్లో మంచి, చెడు బ్యాక్టీరియాలు ఉంటాయి. మనం ఆరోగ్యకర అలవాట్లు పాటిస్తే మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. అదే చెడు అలవాట్లు పాటిస్తే హానికారక బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అందుకే పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి. ముఖ్యంగా మొక్కల నుంచి వచ్చిన మంచి ఆహారాన్ని తీసుకోవాలి. "
--డాక్టర్ రాకేశ్ కలపాల, ఏఐజీ హాస్పిటల్స్
మన శరీరంలో నిరంతరం జరిగే జీవక్రియలు రెండు రకాలుగా ఉంటాయి. అందులో మొదటిది ఎనబాలిజం, రెండోది కెటబాలిజం..
1.ఎనబాలిజం అంటే సరళమైన అణువుల నుంచి సంక్లిష్టమైన అణువుల నిర్మాణం
2.కెటబాలిజం అనగా సంక్లిష్ట అణువులు సరళమైన అణువులుగా విచ్ఛిన్నం కావడం
ఆరోగ్యకరమైన శరీరానికి రెండూ అవసరమని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో జీవక్రియ జరుగుతున్నప్పుడు సూక్ష్మ అణువులు ఉత్పత్తి అవుతాయి. కణజాల నిర్మాణానికి, మరమ్మతుకు, రోగ నిరోధక శక్తికి ఇవే కీలకమని.. శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచుతుందని అంటున్నారు. ఇంకా శరీరంలోని వ్యర్థాలు కూడా ఈ సూక్ష్మ అణువుల ద్వారానే బయటకు వెళతాయని వివరిస్తున్నారు. జీవక్రియకు అతి ముఖ్యమైన ఈ సూక్ష్మ అణువుల ఉత్పత్తికి ఆకుపచ్చటి ఆహారం దోహదం చేస్తుందని తెలిపారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా? ఎగ్స్ ఆరోగ్యానికి మంచివా కావా?