Hero Chiranjeevi Clarity on His Entry in Politics : తాను రాజకీయాల వైపు మళ్లీ వస్తానేమోనని కొందరు అనుకుంటున్నారు, కానీ జీవితాంతం కళామతల్లి సేవలోనే ఉంటానని ప్రముఖ నటుడు చిరంజీవి స్పష్టం చేశారు. సినీ రంగానికి సేవల కోసమే తాను రాజకీయ పెద్దలను కలుస్తున్నానని వెల్లడించారు. అంతుకుమించి ఏమీ లేదని తెలిపారు.
రాజకీయంగా తాను అనుకున్న లక్ష్యాలు, సేవలు నెరవేర్చేందుకు తన సోదరుడు, జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ఉన్నారని చిరంజీవి చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన బ్రహ్మా ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు. "జీవితాంతం రాజకీయాలను దూరంగా ఉంటూ సినిమాలకు అతి దగ్గరగా ఉంటాను, పెద్ద పెద్ద వారిని కలుస్తున్నాడు ఏంటీ? అటువైపు ఏమైనా వెళ్తాడా? అని కొందరు సందేహపడుతున్నారు. అలాంటి డౌట్స్ ఏమీ పెట్టుకోవద్దు" అని మెగాస్టార్ అన్నారు.
బ్రహ్మానందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ తాత- మనవళ్లుగా నటించిన చిత్రం బ్రహ్మానందం. వెన్నెల కిషోర్, ఐశ్వర్య హోలక్కల్, ప్రియ వడ్లమాని తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటైన వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
విడుదల తేదీ చాలా ముఖ్యం : ఇటీవల జరిగిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వెళ్లినట్లు చిరంజీవి చెప్పారు. దాంతో, నేను తప్ప ఎవరూ లేరా? అని మీకు అనిపించొచ్చు అన్నారు. ఎక్కువ చిత్రాలు వస్తున్న కారణంగా దానికి తగ్గట్టే వేడుకలు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడుందని తెలిపారు. సినిమాకి కథ ఎంత ముఖ్యమో దాని విడుదల తేదీ కూడా అంతే ముఖ్యమన్నారు. ప్రేక్షకులకు చేరువ చేయడం అత్యంత ప్రాధాన్యమన్నారు. ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడి అద్భుతంగా సినీ ప్రచారం చేశారని, ఎక్కడ చూసినా ఆ మూవీ టీమ్ కనిపించేదని చిరంజీవి పేర్కొన్నారు. ఈ మధ్య జరిగిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా మెగాస్టార్ ముఖ్య అతిథిగా వెళ్లారు. అక్కడ కూడా చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు.