IND Vs Aus Border - Gavaskar Trophy : సిడ్నీ వేదికగా ఎంతో ఉత్కంఠగా జరిగిన చివరి టెస్ట్‌లో ఆసీస్ పైచేయి సాధించింది. భారత్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో 3-1 తేడాతో ఐదు టెస్టుల సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్‌లో 162 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయి సాధించింది. దీంతో వరుసగా రెండోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఆస్ట్రేలియా చేరుకోగా, ఈ ఓటమితో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుంచి భారత్ నిష్క్రమించింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా స్కాట్ బోలాండ్ అవార్డు అందుకోగా, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా జస్‌ప్రీత్ బుమ్రా సాధించారు.
మ్యాచ్ సాగిందిలా :
బుమ్రా లేకపోవడం వల్ల భారత బౌలింగ్‌పై ఆసీస్ ఓపెనర్లు ఎదురు దాడికి దిగారు. అయితే సామ్ కొన్‌స్టాస్ (22) వచ్చీ రావడంతోనే దూకుడుగా ఆడాడు. ప్రధాన పేసర్ సిరాజ్ కూడా ఆరంభంలో లెగ్ సైడ్ బంతులు వేయడం వల్ల ఆసీస్ పని ఇంకా సులువైంది. మొదటి రెండు ఓవర్లలోనే 26 పరుగులను ఆసీస్ ఓపెనర్లు సాధించారు. అయితే, ప్రసిధ్ కృష్ణ (3/65) స్వల్ప వ్యవధిలోనే వికెట్లు తీసి ఆసీస్‌ను చిత్తు చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో హాఫ్ సెంచరీ చేద్దామనుకున్న ఉస్మాన్ ఖవాజా (41)కు నిరాశే మిగిలింది. అతడు సిరాజ్ (1/69) బౌలింగ్‌లో ఔటై పెవిలియన్ బాట పట్టాడు. కానీ ట్రావిస్ హెడ్ (34*), వెబ్‌స్టర్ (39*) ఐదో వికెట్‌కు అజేయంగా 58 పరుగులు జోడించి ఆసీస్‌ను విజయ తీరాలకు చేర్చారు. స్టీవ్ స్మిత్ (4), మార్నస్ లబుషేన్ (6) మాత్రం సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
ఆ ఒక్కటే తేడా!
ఇదిలా ఉండగా, ఆసీస్‌తో సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బుమ్రా, రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు రాలేకపోయాడు. ఇదే భారత్‌కు మైనస్ పాయింట్‌గా నిలిచింది. సిరాజ్, ప్రసిధ్, నితీశ్‌తో కూడిన పేస్ విభాగం ఆసీస్‌ను చిత్తు చేయలేకపోయింది. దీంతో ఫ్యాన్స్ అంతా 'బుమ్రా ఉండుంటే ఆస్ట్రేలియా బ్యాటర్లు ఇలా రెచ్చిపోయేవారు కాదు' కామెంట్లు పెడుతున్నారు. అయితే త్వరగానే మూడు వికెట్లను పడగొట్టినప్పటికీ, ఖవాజా, హెడ్, వెబ్‌స్టర్‌ను మాత్రం వారు కట్టడి చేయలేకపోయారు. అయితే ఈ సిరీస్‌లో ఇప్పటివరకు బుమ్రా 32 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడీ కీలక సమయంలో బుమ్రా జట్టులో లేకపోవడం బాధాకరం అని అంటున్నారు.
ఆసీస్ ఫ్యాన్స్‌కు విరాట్ కోహ్లీ కౌంటర్ - ఆ ఒక్క సైగతో అందరూ షాకయ్యారుగా!
33 బంతుల్లో ఫాస్టెస్ట్ 50 - తన రికార్డునే బ్రేక్ చేసిన పంత్!