CMR Engineering College Case Update : మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో అమ్మాయిల బాత్రూంలో వీడియోల ఘటన కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఏ-1 నంద కిషోర్, ఏ-2 గోవింద కుమార్‌ను రిమాండ్‌కు తరలించారు. కళాశాల ఛైర్మన్ చామకూరి గోపాల్‌రెడ్డి సహా ఏడుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో గోపాల్ రెడ్డిని ఏ-7గా చేర్చారు.
ఏడుగురిపై కేసు నమోదు : విద్యార్థినులు స్నానాలు చేస్తుండగా చూసేందుకు ప్రయత్నించామని నిందితులు అంగీకరించినట్లుగా పోలీసులు తెలిపారు. అరెస్టు అయిన ఇద్దరు నిందితులు దురుద్దేశపూర్వకంగా తప్పు చేశామని అంగీకరించినట్లుగా వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయంపై వసతి గృహ నిర్వాహకులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనే ఆరోపణల మేరకు పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి బిహార్‌కు చెందిన ఏ-1 నందకిషోర్ కుమార్, ఏ-2గా గోవింద్ కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీఎంఆర్ కాలేజీలోని ఐటీ క్యాంపస్ హాస్టల్‌లోని స్నానాల గదిలో విద్యార్థినుల వీడియోలు చిత్రీకరించారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఘటనను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. హాస్టల్ బాత్‌రూంలో వీడియోల ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని సైబరాబాద్ సీపీని ఆదేశించింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు.
అమ్మాయిల బాత్రూంలో వీడియోల కేసు - ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు