Indian origin in Paris Olympics 2024 :ప్రతి క్రీడాకారుడు తన జీవితం ఒక్కసారైనా ఒలింపిక్స్‌లో పోటీపడాలని, దేశానికి పతకాన్ని అందించాలని ఆశపడుతుంటాడు. ఈ విశ్వ క్రీడల్లో పాల్గొనాలంటే కొన్ని దేశాల్లో తీవ్రమైన పోటీ ఉంటుంది. అయితే కొందరు తల్లిదండ్రుల వృత్తిరీత్యా స్వదేశాన్ని వీడి వేరే దేశంలో స్థిరపడతారు. వారి పిల్లలు క్రీడలను కెరీర్‌గా ఎంచుకొని ఒలింపిక్స్ స్థాయికి వెళ్తుంటారు. మరి కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఈ పారిస్ ఒలింపిక్స్‌లో భారత ములాలు ఉండి, వేరే దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులెవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రాజీవ్ రామ్ (టెన్నిస్)
రాజీవ్ రామ్ తల్లిదండ్రులు రాఘవ్, సుష్మా బెంగళూరు నుంచి చాలా ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. రాజీవ్ రామ్ తల్లిదండ్రులు సైన్స్ రంగంలో ఉంటే అతడు మాత్రం టెన్నిస్‌ను ఎంచుకున్నాడు. 2019లో రాజీవ్ తండ్రి రాఘవ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో మరణించారు. 2016 రియో ఒలింపిక్స్‌లో వీనస్ విలియమ్స్ జతగా అతడు మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణం గెలిచాడు. మొత్తం ఐదు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్నాడు. పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో రామ్ అమెరికా తరఫున పురుషుల డబుల్స్‌లో పోటీపడనున్నాడు.
శాంతి పెరీరా (అథ్లెటిక్స్)
శాంతి పెరీరా స్వస్థలం కేరళ. ఆమె పూర్వీకులు తిరువనంతపురం నుంచి సింగపూర్‌కు వలస వెళ్లిపోయారు. సింగపూర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ అమ్మాయి 100 మీటర్ల పరుగులో బరిలో ఉంది. ఆసియా క్రీడల్లో రజతం గెలిచి 49 ఏళ్ల సింగపూర్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది.
ప్రీతిక పావడే (టేబుల్ టెన్నిస్)
ఫ్రాన్స్ టేబుల్ టెన్నిస్ బృందంలో ఉన్న ప్రీతిక పావడే తండ్రి స్వస్థలం పుదుచ్చేరి. 2003లో పెళ్లి చేసుకుని పుదుచ్చేరి నుంచి ప్రీతిక తండ్రి ఫ్రాన్స్‌కు వలసవెళ్లిపోయాడు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ప్రీతిక 2004లో జన్మించింది. తండ్రి కూడా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ కావడం వల్ల ప్రీతికకు కూడా ఈ ఆటపై ఇష్టం ఏర్పడింది. 16 ఏళ్ల వయసులో టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడిన ప్రీతిక, ఇప్పుడు పారిస్‌లో మహిళల డబుల్స్, మిక్స్‌డ్ ఈవెంట్లలో బరిలోకి దిగనుంది.