Champions Trophy 2025 India : ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన టీమ్ఇండియా ఈ నెల 19 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సిద్ధమవుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్, తాజాగా ముక్కోణపు సిరీస్‌ను సొంతం చేసుకున్న న్యూజిలాండ్, సంచలనాలు సృష్టించే బంగ్లాదేశ్‌తో గ్రూప్‌దశలో భారత్ తలపడనుంది. ముఖ్యంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ నుంచి టీమ్ఇండియాకు సిసలైన సవాలు ఎదురుకానుంది. గ్రూప్‌దశలో టాప్-2లో నిలిచే జట్లే సెమీస్‌కు అర్హత సాధించనున్న నేపథ్యంలో ప్రతీ మ్యాచ్ కూడా టీమ్ఇండియాకు కీలకంగా మారింది.
ఏడాదిలో మూడోది
ఏడాది వ్యవధిలో మూడో ఐసీసీ టోర్నీలో టీమ్ఇండియా బరిలోకి దిగుతోంది. గత రెండు ICC టోర్నీల్లో టీ20 ప్రపంచకప్‌లో భారత్ విశ్వవిజేతగా నిలవగా వన్డే ప్రపంచకప్‌లో మాత్రం ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఫిబ్రవరి 19 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో 8 జట్లు పోటీపడుతున్నాయి. గ్రూప్ Aలో భారత్ కాకుండా పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఈసారి వన్డే ఫార్మాట్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. గ్రూప్-Aలో భారత్ మూడు మ్యాచ్‌లు ఆడనుంది. టాప్-2 జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్ ఓడినా సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. ఏమాత్రం భారీ ఓటమి ఎదురైనా సరే ఇంటిముఖం పట్టాల్సిందే. టీమ్‌ఇండియా మ్యాచులన్నీ దుబాయ్‌లోనే జరగనున్నాయి.
తొలి పోరు బంగ్లాతోనే
గ్రూప్ Aలో భారత్ ఆడబోయే తొలి మ్యాచ్ బంగ్లాదేశ్‌తోనే. ఫిబ్రవరి 20న ఈ మ్యాచ్ జరగనుంది. ఈ గ్రూప్‌లో కాస్త బలహీనమైన జట్టు బంగ్లానే. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత ఆడిన 12 వన్డేల్లో కేవలం నాలుగు మ్యాచ్‌లనే బంగ్లాదేశ్ నెగ్గింది. 2007వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు బంగ్లా షాకిచ్చింది. అయితే ఇప్పుడున్న బంగ్లాదేశ్ జట్టు పరిస్థితిని బట్టి ఈ మ్యాచ్‌లో గెలవడం భారత్‌కు కాస్త సులువే. బంగ్లా క్రికెటర్లకు 50 ఓవర్ల క్రికెట్ ప్రాక్టీస్ కూడా లేదు. వీరంతా నేరుగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ నుంచి వచ్చారు. కెప్టెన్ షాంటోతోపాటు మహ్మదుల్లా, ముష్ఫికర్ రహీం, ముస్తాఫిజుర్‌పైనే బంగ్లా ఎక్కువగా ఆధారపడి ఉంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారీ విజయం సాధించి సెమీస్ అవకాశాలు మెరుగుపర్చుకోవాలని టీమ్ఇండియా భావిస్తోంది.
హై వోల్టేజ్ మ్యాచ్
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే మ్యాచుల్లో భారత్- పాకిస్థాన్ మధ్య పోరు ఒకటి. ఛాంపియన్స్ ట్రోఫీలో ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా దాయాదులు తలపడనున్నాయి. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా పాకిస్థాన్ బరిలోకి దిగుతోంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌పైనే పాక్ విజయం సాధించి టైటిల్‌ను నెగ్గింది. ఆ మ్యాచ్ ఓటమికి ఇప్పుడు టీమ్‌ఇండియా ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ అఘా మంచి ఫామ్‌లో ఉండటం పాక్‌కు కలిసొచ్చే అంశం. స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఫామ్‌లో ఉన్న యువ సంచలనం సయీమ్ అయుబ్ గాయం కారణంగా వైదొలగడం పాక్‌కు నష్టమే. పాక్ పేస్ త్రయం షహీన్, రవూఫ్, నసీమ్ భారత్‌పై అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ఎదురు చూస్తున్నారు.
కివీస్‌తో జాగ్రత్త
ఐసీసీ టోర్నీల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చే జట్లలో న్యూజిలాండ్ ఒకటి. ఈసారి కూడా భారత్‌కు కివీస్ నుంచి కఠిన సవాల్ తప్పదు. ఆ జట్టులోని ప్రధాన బ్యాటర్లు డేవన్ కాన్వే, టామ్ లేథమ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ మంచి ఫామ్‌లో ఉన్నారు. తాజాగా పాక్, దక్షిణాఫ్రికాతో జరిగిన ముక్కోణపు సిరీస్‌ను కివీస్ సొంతం చేసుకుంది. ఫైనల్‌లో పాక్‌ను ఓడించింది. అయితే, ప్రధాన పేసర్లు టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్ లేకుండానే ఆడనున్న నేపథ్యంలో న్యూజిలాండ్ పేస్ విభాగం కాస్త బలహీనంగానే ఉంది. కివీస్ బౌలింగ్‌తో పోలిస్తే బ్యాటింగ్ బలంగా ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలాంటి సమస్యలు లేకుండా సెమీస్‌కు చేరుకోవాలంటే భారత్ మూడు మ్యాచుల్లోనూ గెలవాలి. ఏమాత్రం ఒక్క అడుగు పొరపాటున పడినా ఇతర జట్లు ఆడే మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. గ్రూప్ స్టేజ్‌ను దాటడం కష్టమవుతుంది. ఆసియా కప్ 2022లో గ్రూప్ స్టేజ్‌లో భారత్ ఒకే ఒక్క మ్యాచ్‌ను గెలిచింది. దీంతో సెమీస్‌కు కూడా చేరలేక విమర్శలను ఎదుర్కొంది.
టీమ్ఇండియాకే కాదు, భారత జెండాకే వణికిపోతున్న పాకిస్థాన్- మరీ ఇంత భయమా!
8ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ- ఫేవరెట్‌గా భారత్- ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయంటే?