Delhi CM Selection Strategy : భారతీయ జనతా పార్టీ- బీజేపీ కొత్త ఒరవడిని కొనసాగిస్తూ దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను అనూహ్యంగా ఎంపిక చేసింది. ఈ ఎంపిక వెనుక అనేక రాజకీయ వ్యూహాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకర్షించడం, దిల్లీలో పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మహిళా ఓటర్లపై గురి
దిల్లీలో మహిళా ఓటర్లు దాదాపు 46 శాతం మంది ఉన్నారు. వారు ఎన్నికలల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో ఆప్, బీజేపీ మహిళా ఓటర్లపై వరాల జల్లు కురిపించాయి. ఆప్ మహిళలకు నెలకు రూ.2100 గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చింది. బీజేపీ కూడా మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక భరోసా ఇస్తామని వాగ్దానం చేసింది. ఈ క్రమంలో రేఖా గుప్తాను సీఎంని చేయడం ద్వారా తమ పార్టీ మహిళా సాధికారతకు కట్టుబడి ఉందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ వ్యూహం రచించింది. అలాగే మహిళా సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని కమలదళం ప్లాన్ చేసింది.
బీజేపీ దీర్ఘకాలిక వ్యూహాలు
దిల్లీ సీఎంగా రేఖా గుప్తాను నియమించడం వెనుక బీజేపీ దీర్ఘకాలిక వ్యూహాలు ఉన్నాయి. దిల్లీ ముఖ్యమంత్రిగా మహిళను నియమించడం వల్ల బీజేపీపై నారీమణులకు మరింత నమ్మకం పెరుగుతుందని కమలం పార్టీ భావిస్తోంది.
ఆ రాష్ట్రాల్లో ప్రభావం చూపేందుకు!
రేఖా గుప్తా స్వస్థలం హరియాణా. ఆమె వైశ్య వర్గానికి చెందినవారు. రేఖా గుప్తాను దిల్లీ సీఎంగా చేయడం వల్ల వైశ్య ఓటర్లను ఆకర్షించొచ్చని బీజేపీ యోచిస్తోంది. అలాగే హరియాణా, త్వరలో ఎన్నికలు జరగబోయే బిహార్, బంగాల్ వంటి రాష్ట్రాలకు సానుకూల సందేశం పంపినట్లవుతుందని భావిస్తోంది.
ఆప్ వ్యూహాలకు చెక్!
దిల్లీలో మహిళలే కేంద్రంగా ఆప్ గత కొంతకాలంగా రాజకీయాలను నడిపింది. మహిళలకు ఉచితాలు ప్రకటించి 2015,2020 ఎన్నికల్లో వారిని ఆకట్టుకుంది. అందుకే ఈ సారి బీజేపీ కూడా ఆప్ మహిళా కేంద్రీకృత రాజకీయాలను సవాల్ చేసింది. ఈ క్రమంలో దిల్లీ సీఎంగా మహిళను ఎంపిక చేసింది. ఇది రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకి కలిసొస్తుందని కమలదళం భావిస్తోంది.
ఏకైక మహిళా సీఎం
ప్రస్తుతం ఎన్డీఏ పాలిత ఏ రాష్ట్రంలోనూ మహిళా ముఖ్యమంత్రి లేరు. దిల్లీకి రేఖా గుప్తాను సీఎంను చేసి బీజేపీ ఆ లోటును తీర్చుకుంది. అలాగే మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడం, వారికి ఉన్నత పదవులు ఇచ్చేందుకు బీజేపీ ఆసక్తిగా ఉందనే సందేశాన్ని కమలదళం ప్రజల్లోకి పంపింది.