Tips to Protect Aadhaar Card from Cyber Attacks: దేశంలో ప్రతి భారతీయుడికీ అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డుగా ఆధార్ మారిపోయింది. ప్రభుత్వ రాయితీలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఏ సంక్షేమ పథకం ప్రయోజనాలు పొందాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఆధార్ విషయంలో చాలా మంది ప్రజలు నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఆధార్ కార్డును ఎక్కడ పడితే అక్కడ వాడుతూ, జిరాక్స్ ఎవరికి పడితే వారికి ఇస్తుంటారు. మరి మీరు కూడా ఇలానే చేస్తుంటారా? అయితే అలర్ట్ కావాల్సిందే అని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆధార్ కార్డ్‌ను ఎక్కడ పడితే అక్కడ వాడుతూ, జిరాక్స్ కాపీలను ఎవరికి పడితే వారికి ఇస్తే అవి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కడమే కాకుండా ఆధార్, ఫోన్ నంబర్ల ఆధారంగా ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల విజయవాడకు చెందిన ఓ వ్యాపారికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బెదిరించారు. ఆయన ఆధార్ నంబరుతో సహా చెప్పి ఫ్లాట్ రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ రైటర్ దగ్గర, ట్రస్టుకు విరాళం ఇచ్చినప్పుడు, ఇంటి పన్ను మార్చేందుకు, ప్లాటు అమ్మే సందర్భాల్లో ఆధార్ ఇచ్చారని వరసపెట్టి చెబుతుంటే ఆయన నోరెళ్లబెట్టారు. అసలు ఈ వివరాలను నేరగాళ్లు ఎక్కడి నుంచి సేకరించారనేది ఆయనకు అంతుపట్టలేదు.
‘ఇ-ఆధార్’తో ఇబ్బందులు తప్పవా?: చాలా మంది డిజిటల్ సంతకంతో వచ్చే ఇ-ఆధార్‌ను గుర్తింపు కార్డుగా వినియోగిస్తుంటారు. దానిపై ఫోన్ నంబర్ ఉంటోంది. ఇది సైబర్ నేరగాళ్లకు చిక్కితే వాటి ద్వారా బ్యాంకు ఖాతాలు సేకరించి, నిధులు కొట్టేస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ ఫోన్ నంబరుతో కొత్త సిమ్ కార్డు సృష్టించి, అసలు సిమ్‌కు బ్యాంక్ ఓటీపీలు రాకుండా తాత్కాలికంగా బ్లాక్ చేస్తారని, వారు సృష్టించిన సిమ్‌కు ఓటీపీలు వచ్చేలా చేసుకుంటారని అంటున్నారు. పని పూర్తయిన తర్వాత అన్ బ్లాక్ చేసి, అసలు సిమ్‌కార్డును పునరుద్ధరిస్తారని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల బ్యాంకు ఖాతాలో డబ్బులు పోయిన సంగతే బాధితులకు తెలియదని అంటున్నారు.
ఈ జాగ్రత్తలు పాటించండి: ఆధార్ కార్డ్ దుర్వినియోగం కావొద్దంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే,

- ఆధార్ కార్డ్ లేదా ఫొటోస్టాట్ తీసుకునే సందర్భంలో కొంత మంది ప్రింట్ సరిగా రాలేదని పక్కన పడేస్తారు. అయితే అలా చేయకుండా దానిని కూడా తీసుకుని ఇంటి దగ్గర ధ్వంసం చేసేయాలని చెబుతున్నారు.
- ఆధార్ కార్డులను అపరిచితులకు మెయిల్స్, వాట్సప్ చేయవద్దని చెబుతున్నారు.
- UIDAIలో ఆధార్ బయోమెట్రిక్‌ను లాక్ చేసుకుంటే ఆన్‌లైన్ మోసాలకు గురయ్యే ప్రమాదం కాస్త తగ్గుతుందని వివరిస్తున్నారు.
- ఆధార్, బ్యాంకింగ్ అవసరాలకు ఉపయోగించే సిమ్‌ను వాట్సప్, టెలిగ్రామ్ వంటి వాటికి వినియోగించొద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వాటికి వచ్చిన గుర్తుతెలియని లింక్‌లను పొరపాటున క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
- ఆధార్ వెబ్సైట్లో యూఐడీఏఐలో పీవీసీ కార్డును బుక్ చేసుకుంటే పోస్టులో ఇంటికే కార్డు వస్తుందని, ఇది క్యూఆర్ కోడ్ వంటి భద్రతా ప్రమాణాలతో ఉంటుందని చెబుతున్నారు.
- చాలా సేవలకు చివరి నాలుగు నంబర్లు మాత్రమే కనిపించే మాస్క్‌డ్ ఆధార్‌ను ఉపయోగిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు.
డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.12కోట్లు లూటీ- ఆధార్ స్కామ్ అంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు ట్రాప్
ఆధార్ కార్డ్‌తో డబ్బులు విత్‌డ్రా - ATM కార్డ్ ఇంట్లో మరిచిపోయినా బేఫికర్ - ప్రాసెస్ ఇదీ!