Ragging In Mahatma Jyotiba Phule School Mancherial : ఈ మధ్యకాలంలో స్కూళ్లలో ర్యాగింగ్ ఘటనలు ఎక్కువవుతున్నాయి. సీనియర్లు కొత్తగా వచ్చిన విద్యార్థులను నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. తల్లిదండ్రులను వదిలి ఉన్నత చదువులు చదువుకునేందుకు వస్తారు. దీంతో సీనియర్లు ర్యాగింగ్ చేసేసరికి మళ్లీ స్కూలుకు వెళ్లనని ఏడ్చుకుంటూ తమ బాధలను చెప్పుకుంటున్నారు.
దాడిచేసి సోషల్ మీడియాలో : తాజాగా మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మహాత్మా జ్యోతిభా ఫూలే గురుకులంలో తమకు సపర్యలు చేయాలని పదో తరగతి విద్యార్థిని అతని సహచరులే బెదిరించారు. చేయకపోవడంతో దాడి చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అతని తల్లిదండ్రుల ఆందోళనతో వారిపై, పాఠశాల ప్రిన్సిపల్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.
బాధిత విద్యార్థి తల్లిదండ్రులు చెప్పిన వివరాల ప్రకారం, నస్పూరు కాలనీకి చెందిన మనోజ్‌గౌడ్ గురుకులంలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 8న కాగజ్‌నగర్‌లో నవోదయ పరీక్ష రాయడానికి తల్లిదండ్రులతో కలిసి వెళ్లాడు. అనంతరం 9న పాఠశాలకు వెళ్లబోనంటూ మారాం చేయడంతో తల్లిదండ్రులు నచ్చజెప్పి 10న తీసుకొచ్చారు. ఆదివారం మనోజ్ తన తండ్రికి ఫోన్ చేసి పాఠశాలకు రావాలని కోరాడు. తల్లిదండ్రులిద్దరూ వెంటనే పాఠశాలకు రాగా, ఏడుగురు సహచర విద్యార్థులు వారి కాళ్లొత్తాలని, నీళ్లు తీసుకు రావాలని, అడిగినప్పుడు డబ్బులు ఇవ్వాలని తనను తరచూ వేధిస్తున్నారని బోరుమన్నాడు. లేదంటే చంపేస్తామని బెదిరించారంటూ వాపోయాడు.
మూకుమ్మడిగా దాడి : తనతో పాటే ఐదో తరగతిలో పాఠశాలలో చేరిన వారికి తానెందుకు సపర్యలు చేయాలని ప్రశ్నించినందుకు ఈ నెల 6న రాత్రి 10 గంటల సమయంలో ఏడుగురు కలిసి తనను మూకుమ్మడిగా కొట్టారని, దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని మనోజ్ ఏడ్చాడు. ఆదివారం నాడు ప్రిన్సిపల్ లేకపోవడంతో తల్లిదండ్రులు కుమారుడిని ఇంటికి తీసుకెళ్లి తిరిగి సోమవారం వచ్చారు.
విద్యార్థులు, ప్రిన్సిపల్ సస్పెండ్ : జరిగిన విషయమై ప్రిన్సిపల్ ప్రకాశ్‌రావును అడిగారు. దాడికి పాల్పడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. విద్యార్థులను మందలించి ఉన్నతాధికారులకు సమాచారం అందజేశామని ప్రిన్సిపల్ తెలిపారు. సమస్యను సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ఏడుగురు విద్యార్థులను సోమవారం సాయంత్రం గురుకులం నుంచి సస్పెండ్ చేశారు. ప్రిన్సిపల్‌ను సైతం బాధ్యతల నుంచి తప్పించారు.
కంపాస్‌తో గుచ్చి, మర్మాంగంపై డంబెల్స్, గాయాల్లో లోషన్- బయటపడ్డ కేరళ ర్యాగింగ్ దృశ్యాలు
పదో తరగతి విద్యార్థుల ర్యాగింగ్! - ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం