Vishwak Sen Letter : టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఫలితంతో సంబంధం లేకుండా కొద్ది రోజులుగా థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఇటీవల లైలా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయారు. అంతకుముందుకు మెకానిక్ రాకీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గామితో అలరించారు.
అయితే మెకానిక్ రాకీ పర్వాలేదనిపించినా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఘోర పరాజయాన్ని అందుకుంది. గామి మాత్రం విమర్శకుల ప్రశంలు అందుకుంది. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ స్పందించారు. తనని ఆదరిస్తున్న ప్రేక్షకులను ఉద్దేశిస్తూ విశ్వక్ ఒక ప్రకటన విడుదల చేశారు. అందుకు సంబంధంంచిన ఓపెన్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
"అందరికీ నమస్కారం ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నా. నన్ను నమ్మి, నా ప్రయాణానికి మద్దతు ఇచ్చిన నా అభిమానులకు, నాకు ఆశీర్వాదంగా నిలిచిన వారికి హృదయపూర్వక క్షమాపణలు. నా ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే. కానీ, ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నా"
"ఇకపై నా ప్రతి సినిమా క్లాస్, మాస్ ఏదైనా సరే, అసభ్యత ఉండదు. నేను ఒక చెడు సినిమా తీస్తే, నన్ను విమర్శించే హక్కు పూర్తిగా మీకు ఉంది. ఎందుకంటే, నా ప్రయాణంలో ఎవ్వరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరే (ప్రేక్షకులు). నా కెరీర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగా ప్రేమించారో తెలుసు. ఇకపై కేవలం సినిమా మాత్రమే కాదు, నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నా."
"అంతే కాకుండా, నా మీద విశ్వాసం ఉంచిన ప్రొడ్యూసర్స్, డిస్టిబ్యూటర్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే, నా కథానాయకులు దర్శకులు, రచయితలు నా వెన్నెముకగా నిలిచి, నన్ను మలిచిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి నిర్మాణాత్మక విమర్శలకు ధన్యవాదాలు. త్వరలోనే మరొక బలమైన కథతో ముందుకు వస్తా. నా మంచి, చెడు కాలాల్లో నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ మద్దతు నాకు ఎంతో ప్రాముఖ్యం" - మీ విశ్వక్ సేన్
అయితే ప్రస్తుతం విశ్వక్‌సేన్, జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్.కె.వితోతో ఫంకీలో నటిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి రూపొందిస్తున్నాయి. ప్రేమ, వినోదంతో కూడిన ఓ కుటుంబ కథతో ఈ సినిమా రూపొందుతోందని, అన్ని వయసుల ప్రేక్షకులూ కడుపుబ్బా నవ్వుకునేలా ఉంటుందని సినీ వర్గాలు తెలిపాయి.