Long Term Goals Of Millennials : సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలి, ఆర్థిక స్వాతంత్రం సంపాదించాలి- నేటి భారత యువత (మిలీనియల్స్)కున్న మూడు ప్రధానమైన దీర్ఘకాలిక లక్ష్యాలు ఇవే అని ఓ అధ్యయనం తెలిపింది.
ఫైబ్-మిలీనియల్స్ అప్‌గ్రేడ్ ఇండెక్స్ ఆధారంగా చేసిన అధ్యయనం ప్రకారం, ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 41 శాతం కంటే ఎక్కువ మంది, తమకంటూ ఒక ఇల్లు కొనుక్కోవాలని కోరుకుంటున్నారు. పైగా వారి వయస్సు 30 ఏళ్ల కంటే తక్కువగా ఉండడం గమనార్హం. ఇక ఒంటరి పురుషులతో పోలిస్తే, ఒంటరి మహిళలకు ఇల్లు కొనుక్కోవాలనే ఆశయం ఎక్కువగా ఉన్నట్లు సదరు అధ్యయనంలో తేలింది.
ఈ అధ్యయనాన్ని మెట్రో, నాన్-మెట్రో నగరాల్లోని దాదాపు 8000 మంది వ్యక్తులపై నిర్వహించారు. వీరిలో 30 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్నవారు దాదాపు 47 శాతం మంది ; 30-35 ఏళ్లలోపు వారు 26 శాతం, 35-40 ఏళ్లలోపు వారు 14 శాతం, 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్నవారు 13 శాతం మంది ఉన్నారు.
సొంతంగా బిజినెస్!
సర్వే పాల్గొన్న వ్యక్తుల్లో దాదాపు 21 శాతం మంది సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని లేదా తాము చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాదాపు 19 శాతం మంది దీర్ఘకాలంలో ఆర్థిక స్వాతంత్రం సాధించాలని కోరుకున్నారని అధ్యయనం తెలిపింది.
స్వల్పకాలిక లక్ష్యాలు ఇవే!
మరోవైపు ఈ మిలినియల్స్ స్వల్పకాలిక లక్ష్యాల్లో - వృత్తిపరమైన అభివృద్ధి, కొత్త గ్యాడ్జెట్స్, వెహికల్ కొనడం; దంత చికిత్స, కంటి శస్త్రచికిత్స ఉన్నాయి. అలాగే వ్యక్తిగత అభివృద్ధి, ఫిజికల్ ఫిట్‌నెస్ లాంటి ఉన్నాయని అధ్యయనం తెలిపింది.
మంచి జాబ్ ఉండాల్సిందే!
తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో మెట్రోల్లోని మిలీనియల్స్ మంచి ఉద్యోగం సంపాదించడంపై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు. దాదాపు 60 శాతం మంది సరైన ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని అధ్యయనం పేర్కొంది.
'మా అధ్యయనం నేటి యువత (మిలీనియల్స్) శక్తివంతమైన ఆకాంక్షలను వెలికితీసింది. వారు ఎదుర్కొంటున్న బలీయమైన సవాళ్లను, వాటికి తగిన ఆర్థిక పరిష్కారాలను చూపించాల్సిన తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతోంది' అని ఫైబ్ సహవ్యవస్థాపకుడు, సీఈఓ అక్షయ్ మెహ్రోత్రా పేర్కొన్నారు. చాలా మంది మిలీనియల్స్ తమ స్వల్పకాలిక ఆకాంక్షలను నెరవేర్చుకోవడం కోసం ఆర్థిక సంస్థల నుంచి రుణాలను (క్రెడిట్) తీసుకోవడానికి ఆశక్తి చూపిస్తున్నారని అక్షయ్ అన్నారు.
ప్రధానమైన అడ్డంకులు ఇవే!
ఈ అధ్యయన ప్రకారం, దాదాపు 35 శాతం మంది మిలీనియల్స్ తమకు కుటుంబ ఖర్చులు పెద్ద అడ్డంకిగా మారాయని అభిప్రాయపడుతుండగా, 15 శాతం మంది దీర్ఘ కాలిక ప్రణాళిక లేకపోవడమే ప్రధాన అడ్డంకిగా ఉందని పేర్కొన్నారు. అయితే దాదాపు 39 శాతం మంది తాము పొదుపు చేసి, చాలా వ్యూహాత్మకంగా ఆర్థిక ప్రణాళికలు వేసుకుంటామని చెప్పగా, 21 శాతం మంది ఇతర ఆదాయ వనరులను ఆన్వేషించుకుంటామని తెలిపారు. కాగా 29 శాతం మంది తమ దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికి ఆర్థిక సంస్థల నుంచి రుణాలను (క్రెడిట్)ను తీసుకుంటామని తెలిపారు.