Kidney Failure Reasons : మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. ఆహారం జీర్ణమయ్యే సమయంలో ఏర్పడే మలినాలు, శరీరంలో జరిగే జీవక్రియలో ఏర్పడే వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడూ తొలగించి ఆరోగ్యంగా ఉండేలా కిడ్నీలు సాయంచేస్తాయి. అయితే, ఇటీవల కాలంలో అనేక కారణాల వల్ల చాలా మంది కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కారణం సరైన ఆహారం తీసుకోకపోవడం, అధిక రక్తపోటు అని చాలా మంది అనుకుంటారు. కానీ, రోజూవారీ జీవితంలో ఉపయోగించే కొన్ని వస్తువుల వల్ల కూడా మన మూత్ర పిండాలు దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫెయిర్‌నెస్ క్రీమలు: చాలా మంది ఉపయోగించే ఫెయిర్‌నెస్ క్రీముల వల్ల కిడ్నీలు దెబ్బతింటాయని నిపుణులు అంటున్నారు. ఇందులో మెలనిన్ ఉత్పత్తిని అడ్డుకునేందుకు వాడే హానికారక మెర్కురీ అధికంగా ఉంటుందని.. దీనిని చర్మం గ్రహించడం వల్ల శరీరంలోకి చేరి కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉందని వెల్లడించారు. దీర్ఘకాలం పాటు మెర్కురీతో కూడిన సౌందర్య ఉత్పత్తులను వాడడం వల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకోసమే ఇలాంటి ఉత్పత్తులు కొనేముందు అందులోని పదార్థాలను చూడాలని.. అవసరమైతే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలని సూచించారు.

హెర్బల్ సప్లిమెంట్లు: హెర్బల్ సప్లిమెంట్లను పార్మా మందులకు ప్రత్యామ్నాయంగా భావిస్తుంటారు చాలా మంది. అయితే, వీటిపై నేచురల్, హెర్బల్ అని పెట్టినా సరే.. సరిగ్గా పరీక్షించకపోవడం వల్ల కొన్ని ఉత్పత్తుల్లో హానికారక రసాయనాలు కలిపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఆర్సనిక్, లెడ్, మెర్కురీ వంటి విషపూరిత పదార్థాలను వాడడం వల్ల అవి శరీరంలో పేరుకుపోయి కిడ్నీలను దెబ్బతీస్తాయని తెలిపారు. అందుకే హెర్బల్ ఉత్పత్తులను వాడే ముందు డాక్టర్లను సంప్రదించాలని.. మంచి పేరున్న బ్రాండ్ ఉత్పత్తులను వాడాలని సూచిస్తున్నారు.

పెయిన్ కిల్లర్స్: మనలో చాలా మంది తల, కండరాల నొప్పులు లేదా ఇతర ఇబ్బందులు ఎదురైనప్పుడు నేరుగా షాపునకు వెళ్లి పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు. అయితే, ఈ మందులు స్వల్పకాలం నొప్పిని తగ్గించినా.. దీర్ఘకాలంలో అనేక ఇబ్బందులను తెస్తాయని నిపుణులు వెల్లడించారు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందని వివరిస్తున్నారు. వీటిని తరచూగా తీసుకోవడం వల్ల కిడ్నీలకు రక్త సరఫరాను తగ్గి ఫలితంగా కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. 2017లో British Medical Journalలో ప్రచురితమైన "Long-term use of NSAIDs and risk of chronic kidney disease" అనే అధ్యయనంలో ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
గ్రీన్ టీ: ప్రపంచంలోనే ఆరోగ్యకరమైన పానీయాల్లో గ్రీన్ టీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటుంటారు. కానీ, గ్రీన్ టీని ఎక్కువగా తాగడం వల్ల (రోజుకు అర లీటర్ కంటే ఎక్కువ) కిడ్నీలు ఫెయిల్ అవుతాయని మీకు తెలుసా? ఇందులో ఉండే ఆక్సలెట్స్.. క్యాల్షియంతో కలిసి కిడ్నీలో రాళ్లు ఏర్పడేలా చేస్తాయని వెల్లడించారు. అలా అని మొత్తంగా గ్రీన్ టీని మానేయాల్సిన అవసరం లేదని.. కానీ ఎక్కువ మోతాదులో తీసుకోకూడదని సూచిస్తున్నారు. మీకు ఇప్పటికే కిడ్నీలో రాళ్లు సమస్య ఉంటే తక్కువ మోతాదులో తాగాలని సలహా ఇస్తున్నారు.

ప్రొటీన్ సప్లిమెంట్లు: పోషకాహార లోపం ముఖ్యంగా జిమ్‌కు వెళ్లేవారు వ్యాయామంలో భాగంగా ప్రొటీన్ సప్లిమెంట్లను తీసుకుంటారు. కండరాలు పెరగడానికి చాలా మంది పౌడర్లు, షేక్స్ తీసుకుంటారు. అయితే, వీటిని అతిగా తీసుకోవడం వల్ల కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. మనం తీసుకునే ప్రొటీన్లను ఫిల్టర్ చేసే బాధ్యత కిడ్నీలపై ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల వాటిని ఫిల్టర్ చేయలేక కిడ్నీపై ఒత్తిడి పెరిగి సమస్యలు వస్తాయని వివరించారు. అందుకే వీటిని మరీ ఎక్కువగా కాకుండా.. తగిన మోతాదులో తీసుకోవాలని అవసరమైతే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
హెయిర్ స్ట్రెయిటెనింగ్ ఉత్పత్తులు: కొంతమంది తరచూగా హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేసుంకుంటారు. ఇందుకోసం మార్కెట్లో దొరికే కొన్ని ఉత్పత్తులను వాడుతుంటారు. అయితే, ఇందులో ఉండే గ్లైయాక్లాలిక్ యాసిడ్ చర్మం ద్వారా శరీరంలోకి చేరి కిడ్నీలను దెబ్బ తీస్తాయని వెల్లడిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
'సైలెంట్ హార్ట్ ఎటాక్' గురించి మీకు తెలుసా? ఎవరికి ఎక్కువగా వస్తుంది? లక్షణాలు, జాగ్రత్తలు ఏంటి?
30 ఏళ్లు దాటాయా? ఇవి తింటే స్ట్రోక్ వచ్చే ఛాన్స్ తక్కువట! అవేంటో తెలుసా?