Delta Airlines Plane Crash : కెనడాలోని టొరంటోలో విమానం ల్యాండ్ అయిన తర్వాత అదుపు తప్పి తలకిందులుగా బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మందికి గాయపడ్డారు. వీరిలో ఓ చిన్నారి సహా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.
ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం, అమెరికాలోని మిన్నెపొలిస్ నుంచి బయల్దేరిన డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం పియర్‌సన్ విమానాశ్రయ రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దట్టంగా మంచు పేరుకుపోయిన రన్‌వేపై విమానం జారుతూ బోల్తాపడింది. ప్రమాదం కారణంగా విమానంలో మంటలు చెలరేగాయి. ఎమర్జెన్సీ సిబ్బంది అప్రమత్తమై వాటిని అదుపుచేశారు. అందులో చిక్కుకుపోయిన ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాద సమయంలో విమానంలో నలుగురు సిబ్బందితో సహా 76మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
BREAKING: A Delta Airlines CRJ 900 crashed and settled upside down at Toronto Pearson Airport.
— Errol Webber (@ErrolWebber) February 17, 2025
Thankfully, ALL passengers survived and are accounted for. That is great news! pic.twitter.com/dXXUNkPTHU
ఘటనకు గల కారణాలను ఇప్పుడే చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో టొరంటో విమానాశ్రయం వద్ద ఉష్ణోగ్రత మైనస్ 8.6 డిగ్రీలుగా ఉంది. గంటకు 51కిలోమీటర్ల వేగంతో శీతల గాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రన్‌వేపై దట్టంగా మంచు పేరుకుపోయింది. ఇవన్నీ ల్యాండింగ్‌కు ఇబ్బందికరంగా మారి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోంది.