Cricketers In Army:భారతదేశంలో ఆయా క్రీడల్లో అద్భుతంగా రాణించడమే కాకుండా, దేశ సాయుధ బలగాల్లో భాగమైన క్రీడాకారులు ఉన్నారు. క్రీడల్లో దేశానికి అందించిన సేవలకుగాను ఆర్మీలో వివిధ హోదాలు పొందారు. ఔత్సాహిక క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వంటి స్టార్ల నుంచి అభినవ్ బింద్రా, నీరజ్ చోప్రా వంటి ఒలింపిక్ ఛాంపియన్‌ల వరకు ఈ గౌరవం అందుకున్నారు.
కపిల్ దేవ్:భారత జట్టు మాజీ కెప్టెన్, ప్రపంచ కప్ హీరో కపిల్ దేవ్‌కు కూడా మిలిటరీ హోదా ఉంది. 2008లో అతడు టెరిటోరియల్ ఆర్మీలో చేరాడు. లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ ర్యాంక్ పొందాడు. వాస్తవానికి కపిల్ దేవ్ సైనిక నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడు. అతడి తండ్రి రామ్ లాల్ నిఖాంజ్ భారత సైన్యంలో పని చేశారు.
సచిన్ తెందుల్కర్:క్రికెట్ లెజెండ్ సచిన్‌కి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్ కెప్టెన్ గౌరవ ర్యాంక్ లభించింది. క్రికెట్‌లో అతని అసాధారణ విజయాలు, భారతీయ క్రీడలకు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది.
ఎంఎస్ ధోనీ:భారత మాజీ కెప్టెన్ ఎంస్ ధోనీ, ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాను కలిగి ఉన్నాడు. 2015లో పారాచూట్ రెజిమెంట్ శిక్షణ పొందాడు. వివిధ సైనిక కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. క్రికెట్, సాయుధ దళాలు రెండింటిలో అతడి కమిట్‌మెంట్, భారతదేశానికి వివిధ రంగాల్లో సేవ చేయాలనే అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది.
నీరజ్ చోప్రా:నీరజ్ చోప్రా వరుసగా రెండు ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో పతకాలు సాధించాడు. టోక్యోలో గోల్డ్, పారిస్‌లో సిల్వర్ గెలిచాడు. అతడు రాజ్‌పుతానా రైఫిల్స్‌లో నాయబ్ సుబేదార్ ర్యాంక్‌ను కలిగి ఉన్నాడు. నీరజ్ తండ్రి సతీష్ కుమార్ కూడా సైన్యంలో పని చేశారు. నీరజ్ చోప్రా మిలిటరీ ర్యాంక్, క్రీడల్లో సాధించిన విజయాలు అందరికీ స్ఫూర్తిదాయకం. ఔత్సాహిక క్రీడాకారులకు నీరజ్ రోల్ మోడల్‌గా నిలిచాడు.