Special Story On Yadagirigutta : లోక సంరక్షణకు ఉగ్ర నరసింహుడు ఐదు రూపాలతో వెలిసిన పంచ నారసింహ క్షేత్రం యాదగిరి గుట్ట ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఆదరణ పొందుతుంది. గతంలో కొండపైన గల 14.03 ఎకరాల ప్రాంగణాన్ని క్షేత్రాభివృద్ధిలో భాగంగా 20 ఎకరాల పైగా రక్షణ గోడతో విస్తరించారు. అర ఎకరంలోని దేవాలయాన్ని 4.03 ఎకరాలకు విస్తరించారు. సంపూర్ణంగా అష్టబుజి మండప ప్రాకారాలతో పునర్నిర్మించారు. నల్లరాతితో ఆవిష్కృతమైన పంచనారసింహ క్షేత్రం భక్తులకు దివ్యానుభూతిని కలిగిస్తుంది.
మూడు రకాల దర్శనాలు : ఇక్కడ సర్వదర్శనం, శ్రీఘ్ర దర్శనం, బ్రేక్ దర్శనం ఇలా మూడు రకాల దర్శనాలు ఉంటాయి. వేకువజామున 3.30 గంటలకు ప్రారంభమై శయనోత్సవం వరకు రాత్రి పది గంటల దాకా దర్శనాలు ఉంటాయి. ఆలయ ఈవో భాస్కర్‌రావు క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులకు అవసరమైన వివరాలు తెలిపేందుకు సమాచార కేంద్ర ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఈ క్షేత్రాభివృద్ధిలో ప్రధానాలయ పునర్నిర్మాణం తర్వాత క్షేత్ర సందర్శన కోసం వచ్చే భక్తుల సంఖ్య భాగా పెరిగింది. రాష్ట్ర రాజధానికి 60 కి.మీ దూరాన ఉన్న ఈ క్షేత్ర సందర్శన, స్వామివారి దర్శన వివరాలు ఇలా ఉన్నాయి.
శీఘ్ర దర్శనం : త్వరగా దైవ దర్శనం చేసుకునే భక్తుల కోసం శీఘ్ర దర్శనం పేరిట ప్రత్యేక క్యూ ద్వారా ఆలయంలోకి ప్రవేశాన్ని కల్పించారు. టికెట్ ఖరీదు రూ.150 నిర్ణయించారు. ఈ దర్శనానికి ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఆఫ్‌లైన్ ద్వారా వీఐపీ వాహనాల పార్కింగ్ ఎదుట బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేశారు. ఈ దర్శనానికి గంట సమయం పడుతుంది.
వీఐపీ బ్రేక్ దర్శనం : వీఐపీ భక్తులకు రోజూ ఉదయం 9 నుంచి 10 గంటలు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బ్రేక్ దర్శన సదుపాయం ఉంటుంది. వారు అతి దగ్గర నుంచి దేవున్ని దర్శించుకోవచ్చు. ఉత్తర ద్వారం ద్వారా అంతరాలయ ప్రవేశం కల్పిస్తారు. ఈ దర్శనం రూ.300 టికెట్‌తో ఒక్కరికి మాత్రమే అనుమతిస్తారు. టికెట్లను ప్రొటోకాల్ కార్యాలయం, ప్రధాన బుకింగ్ కార్యాలయంలో వీటిని అమ్ముతారు. తప్పకుండా సంప్రదాయ దుస్తులు ధరించాలి.
వృద్ధులు, దివ్యాంగులకు : స్వామి వారి దర్శనానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, 10 ఏళ్లలోపు పిల్లలు, అనారోగ్య భక్తులకు వీఐపీ వాహనాల పార్కింగ్ ఎదుట గల షెడ్ వద్ద నుంచి ఉచితంగా వాహనాల ద్వారా తూర్పు రాజగోపురం ప్రధాన ద్వారంలోంచి ఆలయంలోకి అనుమతిస్తారు. వారి సహాయకులు రూ.150 టికెట్‌తో వెళ్లాలి.
సర్వసేవా పథకం : యాదవ మహర్షి తపస్సు ఫలితంగా స్తంభోద్భవ నారసింహుడు ఐదు రూపాలతో వెలసిన ఈ క్షేత్రంలో నిత్యం కొనసాగే కైంకర్యాలన్నింటిలో పాల్గొనే అవకాశం సర్వసేవా పథకం ద్వారా దక్కుతుంది. టికెట్ ధర రూ.5,116. దంపతులు తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు జరిగే సుప్రభాతం, నిజాభిషేకం, అర్చన, సుదర్శనహోమం, కల్యాణం, జోడు సేవ, సహస్రనామార్చన, దర్బార్ సేవోత్సవం, శయనోత్సవ పూజల్లో పాల్గొనవచ్చు. దంపతులతో పాటు 10 సంవత్సరాల లోపు ఇద్దరు పిల్లలను అనుమతిస్తారు
స్థానికులకు : గుట్ట మండలం, పట్టణ వాసులు ప్రతి మంగళవారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, శనివారం ఉదయం 7.15 నుంచి గంటన్నర పాటు సంప్రదాయ దుస్తులతో గర్భాలయంలోకి ప్రవేశించి స్వయంభూమూర్తులను దర్శించుకోవచ్చు.
ఆర్జిత పూజలు ఇలా...
- స్వామి దర్శనానికి ఆర్జిత పూజలు సైతం దోహదపడతాయి. ఉదయం 9.45 నుంచి 11.30 గంటల వరకు నిర్వహించే శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణంలో దంపతులు పాల్గొనవచ్చు. టికెట్ ధర రూ.1,500.
- ఉదయం 5.15 నుంచి 6.15 గంటల వరకు మూలవరులకు నిజాభిషేకం నిర్వహిస్తారు. టికెట్ ధర ఒకరికి రూ.400, దంపతులకు రూ.800. ఉదయం 6.15 నుంచి 7 గంటల వరకు జరిగే పూజలకు ఒక్కొక్కరికి అర్చన టికెట్ ధర రూ.300.
- ఉదయం 7.30 నుంచి 8.15 గంటల వరకు శ్రీ సుదర్శన నారసింహహోమం ఉంటుంది. రూ.1,250 టికెట్‌తో దంపతులు పాల్గొనవచ్చు.
- సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు చేపట్టే అలంకార జోడు సేవా పర్వంలో రూ.700 టికెట్‌తో దంపతులు పాల్గొనవచ్చు.
- సాయంత్రం 6.30 నుంచి 7 గంటల వరకు జరిపే దర్బార్ సేవోత్సవంలో రూ.516 టికెట్‌తో దంపతులకు ప్రవేశం ఉంటుంది.
- వేకువ జామున 3.30 గంటలకి రూ.100 టికెట్‌తో సుప్రభాతం, రాత్రి 9.30కి శయనోత్సవ దర్శనం కోసం రూ.100 టికెట్ ద్వారా ఒక్కరు మాత్రమే వెళ్లొచ్చు.
భక్త జనసంద్రమైన యాదాద్రి దేవాలయం - ఉచిత దర్శనానికి 3 గంటల సమయం - Devotees Rush in Yadadri Temple
భక్తజనసంద్రమైన యాదాద్రి దేవాలయం- ఉచిత దర్శనానికి 2 గంటల సమయం - Yadadri Temple Rush