China Manja Accidents In Telangana : నిషేధిత చైనీస్ సింథటిక్ మాంజా పంజా విసురుతోంది. రోడ్లపై, చెట్లపై తెగిపడిన దారాలు వాహనదారులకు గాయాలు చేస్తుండగా పక్షులకు యమపాశంగా మారాయి. గాజు ముక్కల పొడి, ఇతర మిశ్రమాలను కలిపి పూతగా వేస్తుండటంతో పతంగులు ఎగురవేసే చిన్నారులు గాయాలపాలవుతున్నారు. ఏళ్లుగా ప్రమాదాలు జరుగుతున్నా.. పోలీసులు కట్టడికి ప్రయత్నిస్తున్నా.. గుట్టు చప్పుడు కాకుండా మాంజా మార్కెట్లోకి వస్తుంది.
మాంజాల విక్రయాలకు కేంద్రంగా పాతబస్తీ : పాతనగరం కేంద్రంగా నిషేధిత మాంజా జోరుగా అమ్ముడవుతుంది. ఆన్లైన్ ట్రేడింగ్, ఇళ్లలో, గోదాముల్లో దాచి గుట్టుగా అమ్ముతున్నారు. పంతంగులు, మాంజాల విక్రయాలకు కేంద్రమైన పాతబస్తీకి తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి రిటైల్ వ్యాపారులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. గుల్జార్‌హౌజ్, కేశవగిరి, సంతోష్‌నగర్, ధూల్‌పేట్, నాంపల్లి, పురానాపూల్‌లో హోల్‌సేల్ పంతంగుల దుకాణాలు 500పైగా ఉన్నాయి. సంక్రాంతికి రూ.50 నుంచి కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఒక్కో దుకాణానికి నాలుగైదు గోదాములు ఉంటాయి. వాటిల్లో సరుకులు కాకుండా మాంజాను భద్రపరుస్తూ ఆన్లైన్లో అమ్ముతున్నారు.
మాంజాలతో పక్షులకు గాయాలు : మాంజాలతో పక్షులు చనిపోతున్నాయి. దీంతో హైదరాబాద్‌కు చెందిన ది యానిమల్ వారియర్ కన్జర్వేషన్ సొసైటీ (ఏడబ్ల్యూసీఎస్) సంస్థ పక్షుల సంరక్షణ కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టింది. గత సంవత్సరం సంక్రాంతి సమయంలో 3 రోజుల్లో 45 పక్షులను రక్షించారు. గతేడాది మొత్తం 1256 పక్షులను రక్షించారు. తాజాగా జనవరి 10 నుంచి మొత్తం 22 పక్షులను రక్షించారు. మాంజాలో చిక్కుకున్న పక్షులు, గాయాలైన జంతువులు కనిపిస్తే 9697887888 కు ఫోన్ చేయాలని ప్రతినిధి ప్రదీప్ తెలిపారు.
మాంజాతో గాయపడిన ఉదంతాలు
- ఇటీవలె చర్లపల్లి డివిజన్ శివసాయి నగర్ కాలనీలో కొందరు గాలిపటాలు ఎగరవేస్తున్నారు. భర్తతో బైక్‌పై వెళ్తున్న మహిళ మెడకు చైనా మాంజా తగలడంతో గాయాలయ్యాయి.
- బీజేఆర్నగర్ కాలనీ పార్కు వద్ద రోడ్డుపై కొందరు పంతంగులు ఎగరేస్తుండగా అదే కాలనీకి చెందిన శ్రీనివాస్ పటేల్ కుమారుడు లోకేష్‌తో బైక్‌పై వెళ్తుండగా కిందకు వేళాడుతున్న చైనా మాంజా దారం తాకి లోకేష్ పెదవి, చేతికి గాయాలయ్యాయి.
- హుమాయున్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైకుపై మహమ్మద్ రియాన్, మహమ్మద్ ఆదిల్ ఆసిఫ్‌నగర్ నుంచి నాంపల్లి వైపు వెళ్తుండగా దేవునికుంట హిందూ శ్మశానవాటిక వద్ద మాంజా గొంతుకు తగిలి రియాన్‌కు తీవ్ర గాయమైంది.
పతంగులు ఎగురవేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- విద్యుత్తు తీగలు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లో, మైదానాల్లో మాత్రమే పతంగులు ఎగరవేయాలి.
- గాలిపటాలు, మాంజాలు విద్యుత్తు తీగలపై పడితే తీసే ప్రయత్నం చేయవద్దు. తీస్తే విద్యుత్తు తీగలు ఒకదాని ఒకటి రాసుకొని విద్యుత్తు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.
- కాటన్, నైలాన్లతో చేసిన మాంజాలను మాత్రమే వాడండి. మెటాలిక్ మాంజాలు విద్యుత్తు వాహకాలు కాబట్టి ఇవి తీగలపై పడితే షాక్ కొట్టే ప్రమాదం ఉంది.
- బాల్కనీ గోడల మీద నుంచి పతంగులు ఎగరవేయవద్దు. పిట్టగోడలు లేని భవనాలపై ఎగురవేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా గల్లీలో కొన్ని భవనాలపై నుంచి విద్యుత్తు తీగలు వెళుతుంటాయి. ఇక్కడ అసలే ఎగురవేయద్దు.
- తెగిన విద్యుత్తు తీగలను పిల్లలు తాకవద్దు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు, ప్రమాదకర ఘటనలు జరిగినా వెంటనే 1912 ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి.
చేతి వేలు తెంచిన చైనా మాంజా - ఈ జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణానికే ప్రమాదం!
ప్రమాదాలకు కారణమౌతున్న చైనా మాంజా - జనగామలో నలుగురికి గాయాలు