Delhi Cabinet Ministers Announced : దిల్లీ కేబినెట్ మంత్రులు ఖరారయ్యారు. పర్వేశ్ వర్మ, ఆశిశ్ సూద్, పంకజ్ సింగ్, మంజిందర్ సిర్సా, కపిల్ మిశ్ర, రవిందర్ ఇంద్రజ్ పేర్లను ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యమంత్రిగా నియమితులైన రేఖ గుప్తా సలహా మేరకు, బీజేపీ ఎమ్మెల్యేలను దిల్లీ ప్రభుత్వం మంత్రులుగా రాష్ట్రపతి నియమించారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ పేర్కొంది. వీరు ఈరోజు ముఖ్యమంత్రితో పాటుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దిల్లీ రాంలీలా మైదానంలో గురివారం జరిగే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీఓ నేతలు ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు.
స్పీకర్గా విజేందర్ గుప్త!
దిల్లీ అసెంబ్లీ స్పీకర్ అభ్యర్థిగా రోహిణి ఎమ్మెల్యే విజేందర్ గుప్తా నామినేట్ అయ్యారని పార్టీ నాయకులు గురువారం తెలిపారు. తన నామినేషన్‌ను ధృవీకరిస్తూ గుప్తా మీడియాతో మాట్లాడారు. గత ఆప్ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన CAG నివేదికలను అసెంబ్లీ ముందు ఉంచుతానని అన్నారు. గత ఆప్ ప్రభుత్వం తన పనితీరుపై 14 CAG నివేదికలను సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకుంటోందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు విజేందర్ గుప్తా. మరోవైపు, మోహన్ సింగ్ బిస్త్ డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
సీఎం అవుతానని నాకే తెలియదు : రేఖా గుప్తా
ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ముఖ్యమంత్రి అవుతానని తనకు తెలియదని రేఖా గుప్తా అన్నారు. "48మంది ఎమ్మెల్యేల్లో ఒకరిగా జేపీ శాసనసభాపక్ష సమావేశానికి వెళ్లాను. కానీ పర్వేశ్‌వర్మ నా పేరు ప్రతిపాదించిన తర్వాతే తెలిసింది. అలాగే మార్చి ఎనిమిది నాటికి దిల్లీలోని మహిళలకు నెలకు రూ.2500 అందజేస్తాం. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. అలాగే సీఎంగా నన్ను ఎంపిక చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శీష్‌మహల్‌ను మ్యూజియంగా మారుస్తాము" రేఖా గుప్తా అన్నారు.