QR Code For Thirukkural : తమిళనాడులోని కరూర్ జిల్లాలో విద్యార్థులకు తిరుక్కురల్( తమిళ సూక్తులు) నేర్పేందుకు ఉపాధ్యాయుడు వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. క్యూఆర్ కోడ్ ద్వారా స్టూడెంట్స్ తిరుక్కురల్ నేర్చుకునే ఆధునిక అభ్యాస పద్ధతిని అభివృద్ధి చేశారు. అలాగే తిరుక్కురల్ ప్రాముఖ్యతను బోధిస్తున్నారు. దీంతో విద్యార్థులు కూడా తిరుక్కురల్ నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయుడిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
భాష అభివృద్ధి కోసం
కరూర్ జిల్లాలోని వెల్లియానా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మనోహర్ తమిళం అభివృద్ధి కోసం టెక్నాలజీని ఉపయోగించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే తిరుక్కురల్ వచ్చేట్లు ఏర్పాటు చేశారు. దీంతో పాఠశాలలో ఉన్న ట్యాబ్‌లు, తల్లిదండ్రుల మొబైల్స్‌లో విద్యార్థులు తిరుక్కురల్‌ను చదువుకుంటున్నారు.
నాకు వారు అండగా ఉన్నారు: ఉపాధ్యాయుడు
"కన్యాకుమారిలో తిరువల్లూవర్ విగ్రహాన్ని ప్రతిష్టించి 25 ఏళ్లు పూర్తయింది. దీంతో రజతోత్సవాలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తిరుక్కురల్ సంబంధిత పోటీలలో పాల్గొనమని తమిళనాడు సర్కార్ ఆహ్వానించింది. తిరుక్కురల్‌ను విద్యార్థులు సులభంగా నేర్చుకోవడాన్ని క్యూఆర్ కోడ్ వ్యవస్థను రూపొందించాను. మూడు నుంచి ఐదో తరగతి విద్యార్థులు సులభంగా చదవగలిగే ఫార్మాట్‌లో వివరణలతో కూడిన 50 తిరుక్కురల్స్ తయారుచేశాను. నేటి తరం మొబైల్ ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అందుకే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నాను. పాఠశాల ప్రిన్సిపల్, జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ ప్రయత్నానికి మద్దతుగా నిలిచారు" అని ఈటీవీ భారత్‌కు మనోహర్ తెలిపారు.
తమిళనాడులో ప్రైవేట్ పాఠశాలలు పెరిగిపోయాయని వెల్లియానా స్కూల్ ప్రిన్సిపల్ ధర్మలింగం తెలిపారు. తమ పాఠశాలలో దాదాపు 170 మంది విద్యార్థులు చదువుతున్నారని పేర్కొన్నారు. "తమిళనాడు ప్రభుత్వం పాఠశాలలకు అందించిన ఆధునిక టచ్ స్క్రీన్ కంప్యూటర్లు, ట్యాబ్‌లను ఉపయోగించి విద్యార్థులు తిరుక్కురల్ నేర్చుకుంటున్నారు" అని ధర్మలింగం వెల్లడించారు.
విద్యార్థులకు సైతం ఆసక్తి
అలాగే క్యూఆర్ కోడ్ ద్వారా తిరుక్కురల్ నేర్చుకోవడంపై విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. స్కూల్ టీచర్ ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ తిరుక్కురల్ అభ్యాస ప్రక్రియను మరింత సులభతరం చేసిందని చెబుతున్నారు. ఈ క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించిన తాను ఇప్పటి వరకు 40 కిపైగా తిరుక్కురల్‌ను కంఠస్థం చేశానని విద్యార్థిని యాజిని తెలిపింది.
'మొబైల్‌ను ఇప్పుడు తిరుక్కురల్ కోసం వాడుతున్నా'
"కొన్నాళ్ల క్రితం నేను నా తల్లిదండ్రుల సెల్‌ఫోన్ తీసుకొని వినోదం కోసం ఉపయోగించేవాడిని. ఇప్పుడు నా తండ్రి ఫోన్‌ను ఎక్కువగా తిరుక్కురల్ చదవడానికే వాడుతున్నాను" అని పెరియకుమార్ అనే విద్యార్థి చెప్పాడు.