Sunrays Touching Shiva Lingam : సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్రంలో ఉన్న శ్రీ స్వయం భూ శంబూలింగేశ్వర స్వామిని సూర్యకిరణాలు తాకే అద్భుత దృశ్యాలు భక్తులను కనువిందు చేశాయి. లేలేత సూర్యకాంతులతో స్వయం భూ శంబు లింగేశ్వర స్వామి వారు కాంతులీనారు. మహాశివరాత్రికి నాలుగు రోజుల ముందే స్వామివారిని సూర్యకిరణాలు తాకడం విశేషం. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్వామివారిని సూర్యకిరణాలు తాకినట్లుగా ఆలయ అధికారులు వివరించారు.
సూర్యకిరణాలు పడుతున్న సమయంలో దర్శించుకుంటే : సూర్య కిరణాలు శివలింగంపై పడుతున్న సమయంలో స్వామివారిని దర్శించుకుంటే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని, ఆరోగ్యం మెరుగుపడుతుందని, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసమని ఆలయ పండితులు వివరించారు. ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా సూర్యకిరణాలు శివలింగంపై ప్రసరించడం ఆనవాయితీగా వస్తుందని పూజారులు తెలిపారు. మహాశివరాత్రికి మరో నాలుగు రోజుల సమయం ఉన్నప్పటికీ ముందుగానే శివలింగంపై సూర్యకిరణాలు ప్రసరించడం వల్ల ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే పలువురు భక్తులు ఆలయానికి వచ్చి శివలింగాన్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
11వ శతాబ్ధపు అద్భుతం ఈ ఆలయం - ఇక్కడ అన్నీ వింతలూ, విశేషాలే?
ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం.. స్వామి వారి పాదాలను తాకిన సూర్యకిరణాలు..!