China Manja Slits Man Throat In Sangaredddy : చైనా మాంజా ఎంత సులువుగా ఇతరుల పతంగులను తెంపేస్తుందో అంతే ఈజీగా మనుషుల మెడలు, చేతులకు గాయాలు చేస్తాయి. ఈ మాంజా కారణంగా మరణాలు సంభవించిన ఉదంతాలు ఎన్నో. సంక్రాంతి పండుగ అంటే గాలిపటాలు అని ఎంత సంబరపడిపోతారో వాటిని ఎగురవేయడానికి వినియోగించే మాంజా కారణంగా కుటుంబాల్లో విషాదాన్ని మిగుల్చుతోంది. కొంతమంది ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు తీవ్రగాయాలపాలవుతున్నారు. ప్రభుత్వం నిషేధించినా, పోలీసులు ఎన్ని కేసులు నమోదు చేసినా కొందరిలో మార్పు రావడం లేదు. తాజాగా మాంజా దారి చుట్టుకొని రాష్ట్రంలో ఇద్దరు గాయపడ్డారు. తాజాగా సంగారెడ్డి జిల్లా కర్దనూరు రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తికి చైనా మాంజా తగిలి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితుని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
స్థానికులు తెలిపిన వివరాలు మేరకు వికారాబాద్‌కు చెందిన వెంకటేష్ బంధువులతో కలిసి ద్విచక్ర వాహనంపై సంగారెడ్డి జిల్లా కర్దనూరు రహదారి మీదగా శంకరపల్లి వైపు వెళుతున్నాడు. అదే సమయంలో గాలిపటం కోసం కట్టిన చైనా మాంజా అతని గొంతుకు తగిలి కోసుకుపోయింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు చూసి వెంటనే 108కు సమాచారం ఇవ్వడంతో బాధితుడిని పటాన్‌చెరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
చేతి వేలు తెంచిన చైనా మాంజా - ఈ జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణానికే ప్రమాదం!
ఎలాంటి ప్రాణాప్రాయం లేదనడంతో : ఇదిలా ఉండగా నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండల కేంద్రంలో ఒక యువకుడికి చైనా మాంజా చుట్టుకోవడంతో తీవ్రగాయాలయ్యాయి. మండల కేంద్రానికి చెందిన అద్నాన్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చైనా మాంజా చుట్టుకోవడంతో మెడకు, కాలుకు, చేతివేలికి గాయాలయ్యాయి. హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లడంతో డాక్టర్లు చికిత్స చేసి ఎలాంటి ప్రాణాపాయం లేదనడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా చాలామంది మాంజా విక్రయాలు సాగుతూనే ఉన్నాయి. ఈ మాంజా వల్ల కలిగే నష్టాల గురించి ప్రజల్లో మరింత ప్రచారం చేసి అవగాహన పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.
పతంగి నింపిన విషాదం - మాంజా చుట్టుకుని జవాన్, గాలిపటం ఎగరేస్తూ మరో నలుగురి మృతి