Mumbai Indians Replacement : ముంబయి ఇండియన్స్ స్పిన్నర్ అల్లాగ్ గజన్‌ఫర్ గాయం కారణంగా 2025 ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో మేనేజ్మెంట్ అతడి రిప్లేస్మెంట్ ప్రకటించింది. గజన్‌ఫర్ స్థానాన్ని ముజీబ్ అర్ రెహ్మాన్ భర్తీ చేయనున్నట్లు ముంబయి ఆదివారం అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది.
'గజన్‌ఫర్ స్థానాన్ని ముజీబ్ అర్ రెహ్మాన్ భర్తీ చేయనున్నాడు. అఫ్గాన్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న యంగ్ ప్లేయర్లలో ముజీబ్ ఒకడు. ముజీబ్‌కు ముంబయిలోకి స్వాగతం. అలాగే గజన్‌ఫర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం' అని ముంబయి మేనేజ్మెంట్ పోస్ట్ చేసింది. ముంబయి అతడిని రూ.2 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ముజీబ్ 17ఏళ్ల వయసులోనే ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. 2018 ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన అతడు పంజాబ్ తరఫున ఆడాడు. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఆడాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 19 మ్యాచ్‌లు ఆడిన ముజీబ్ 19 వికెట్లు పడగొట్టాడు. ఇక టీ20 కెరీర్లో ఓవరాల్‌గా 300 మ్యాచ్‌ల్లో 330 వికెట్లతో సత్తా చాటాడు. చివరిసారిగా 2021లో ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు.
కాగా, గతేడాది జరిగిన మెగావేలంలో అఫ్గానిస్థాన్‌కు చెందిన 18ఏళ్ల గజన్ఫర్ను ముంబయి రూ.4.8 కోట్లకు దక్కించుకుంది. ఇటీవల కాలంలో జాతీయ జట్టు తరఫున రాణిస్తున్న గజన్ఫర్పై ముంబయి భారీగా ఆశలు పెట్టుకుంది. కానీ, అతడు రీసెంట్గా జరిగిన జింబాబ్వే పర్యటనలో గాయపడ్డాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీతోపాటు, రానున్న ఐపీఎల్‌కు సైతం దూరం అయ్యాడు.
🆕 in town: ✨ 𝕄𝕦𝕛𝕖𝕖𝕓'𝕤 𝕄𝕒𝕘𝕚𝕔 ✨ #MumbaiMeriJaan #MumbaiIndians pic.twitter.com/YIPnK0uJsQ
— Mumbai Indians (@mipaltan) February 16, 2025
ముంబయి జట్టు ఐపీఎల్ 2025 : రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్, నమన్ ధీర్, రాబిన్ మింజ్, కరణ్ శర్మ, దీపక్ చాహర్, ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్, అశ్వని కుమార్, మిచెల్ సాంట్నర్, రీస్ టోప్లీ, KL శ్రీజిత్, రాజ్ అంగద్ బావా, బెవాన్ జాకబ్స్, వెంకట పెన్మెట్సా, అర్జున్ తెందూల్కర్, లిజాడ్ విలియమ్స్, వింగేష్ పుత్తూరు, ముజీబ్ అర్ రహ్మాన్