US Aid For Voter Turnout In India DOGE : భారత్‌లో ఓటింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఓటు ఆవశ్యకతను ప్రజలకు తెలియచెప్పేందుకు అనేక రకాల అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మహిళల కోసం ప్రత్యేక పోలింగ్ బూత్‌లు, దివ్యాంగుల కోసం తగిన ఏర్పాట్లు ఇలా అనేక రకాలుగా భారత ప్రభుత్వం భారీగానే ఖర్చు చేస్తోంది. అయితే భారత్‌లో ఓటింగ్ శాతం పెంచేందుకు అమెరికా సర్కార్ రూ.183 కోట్లు కేటాయించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బైడెన్ సర్కార్ హయాంలోకేటాయించిన ఈ నిధులను ప్రస్తుతం ట్రంప్ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎలాన్ మస్క్ నేతృత్వంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిసియెన్సీ-డోజ్ నిలిపివేసింది. ఈ మేరకు భారత్ సహా వివిధ దేశాల్లో వివిధ కార్యక్రమాలకు కేటాయించిన నిధులను నిలిపివేసినట్లు డోజ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
'భారత ఎన్నికల్లో బయటి శక్తులు'
అమెరికా పన్నుచెల్లింపుదారుల డబ్బు పలు దేశాల్లో వివిధ కార్యక్రమాలకు కేటాయించారని వాటిని రద్దుచేస్తున్నామని డోజ్ వివరించింది. అయితే భారత్‌లో పోలింగ్ శాతం పెంపునకు 21 మిలియన్ డాలర్లను అమెరికా కేటాయించడంపై బీజేపీ సీనియర్ నేత అమిత్ మాలవీయ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇది భారత ఎన్నికల ప్రక్రియలో బయటి శక్తులు జోక్యం చేసుకోవడమేనని పేర్కొన్నారు. ఈ నిధుల ద్వారా ఎవరికి లబ్ది జరిగిందని ప్రశ్నించిన ఆయన కచ్చితంగా అధికార పార్టీ లబ్దిపొందలేదని ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో డోజ్ అధిపతి అయిన ఎలాన్ మస్క్‌తో సమవేశమయ్యారు. భారత్, అమెరికా సంస్థల మధ్య సంబంధాల బలోపేతం, ఆవిష్కరణలు, అంతరిక్ష కార్యక్రమాలు, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, సుస్థిరాభివృద్ధిపై మోదీ, మస్క్ చర్చలు జరిపారు. ఎలాన్ మస్క్‌తో జరిగిన చర్చల్లో మినిమమ్ గవర్నమెంట్, మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు ప్రధాని పేర్కొన్నారు. ప్రధాని పర్యటన ముగిసిన వారం లోపే భారత్‌లో చేయదలిచిన ఖర్చుకు సంబంధించి నిధులను డోజ్ నిలిపివేసింది. ఈ విషయంలో భారత ప్రభుత్వానికి ముందే సమాచారం ఉందా లేదా అనేది స్పష్టత రాలేదు.