How to Make Tomato Powder : మన ఇంట్లో టమాటాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే ఏ కూరకైనా అద్దిరిపోయే రుచి రావాలంటే ఇవి ఉండాల్సిందే. కేవలం కూరలు మాత్రమే కాదు టమాటాలతో పచ్చడి, రసం, పప్పు ఇలా ఏదైనా చాలా బాగుంటాయి. అందుకే మార్కెట్‌కు వెళ్లినప్పుడు కేజీల కొద్ది వీటిని తీసుకొచ్చుకుంటారు. అయితే రేటు తక్కువగా ఉన్నప్పుడు వీటిని కొనడానికి పెద్ద ఇబ్బంది ఉండదు. అదే ధర పెరిగితే మాత్రం అరకేజీ కొనాలన్నా ఆలోచిస్తారు. ఇక టమాటాలు లేకుండా కూరలు బాగోవు అన్నప్పుడు అందరికీ గుర్తొచ్చేది టమాటా పొడి.
ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాలు ఇన్స్టంట్ పొడులు లభిస్తున్నాయి. కావాలనుకున్నప్పుడు మార్కెట్‌కు వెళ్లి తెచ్చుకోవడం, వాటిని వంటల్లో వాడటం పరిపాటి అయ్యింది. అయితే షాప్స్‌లో లభించే పౌడర్స్‌లో రసాయనాలు కలిసే అవకాశం ఉంటుంది. అలాంటి పొడిని కూరల్లో వాడటం వలన ఆరోగ్య సమస్యల ముప్పు ఉంటుంది. కాబట్టి అటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే టమాటా పొడిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం మంచిది. మరి మాకు రాదు అంటారా? డోంట్ వర్రీ. కేవలం ఈ సింపిల్ టిప్స్ పాటించి ఇంట్లోనే నేచురల్‌గా, హెల్దీగా టమాటా పొడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా ఈ పద్ధతిలో చేసుకుంటే నెలల పాటు తాజాగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా టమాటా పొడి ప్రిపరేషన్ ఈ స్టోరీలో చూద్దాం.
తయారీ విధానం:
- మరీ పచ్చిగానో లేదంటే బాగా పండినవో కాకుండా దోరగా ఉండే టమాటాలను ఎంచుకోవాలి.
- వాటిని శుభ్రంగా కడిగి, తడి లేకుండా తుడవాలి.
- ఆపై సన్నగా, పొడ్డుగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు ప్లేట్స్‌లో ఓ క్లాత్ వేసుకోవాలి. ఆ క్లాత్ మీద కట్ చేసుకున్న టమాటా ముక్కలను ఉంచాలి .
- పగలు ఎండలో, రాత్రికి ఫ్యాన్ కింద మూడు రోజులు ఎండబెట్టాలి.
- తడి లేకుండా పూర్తిగా ఎండిపోయిన తర్వాత మిక్సీజార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఎండిన టమాటా ముక్కలు మొత్తం గ్రైండ్ చేసుకోవాలి.
- ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని తడి లేని, గాలి చొరబడని సీసాలో పెట్టి ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోవాలి.
- ఓసారి ఇలా పొడి చేసుకుని పెట్టుకున్నారంటే తరచూ టమాటాలు కొనే పనిలేకుండా ఉంటుంది. ఈ పొడిని రసం, చారు, కూర ఎందులోకైనా వేసుకోవచ్చు. పైగా వంటలు కూడా మంచి టేస్టీగా ఉంటాయట. కాబట్టి ఈసారి టమాటాలు తక్కువ ధరకే దొరికినప్పుడు తెచ్చేసుకుని ఇలా పొడి చేసుకుంటే ధర పెరిగినప్పుడు బాధపడకుండా ఎంచక్కా కూరల్లో వాడుకోవచ్చు. మరి నచ్చితే లేట్ చేయకుండా మీరూ ఈ పొడిని ప్రిపేర్ చేసుకోండి.
కూరల్లోకి ఇలా "ఉల్లి పొడి"ని ప్రిపేర్ చేసుకున్నారంటే - తరచూ ఆనియన్స్ కొనాల్సిన అవసరం ఉండదు!
అన్నం, టిఫెన్స్లోకి అద్దిరిపోయే "పులిహోర పొడి" - ఇలా చేసుకున్నారంటే 6 నెలల పాటు నిల్వ!