BCCI New Rules : టీమ్ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది!. గంభీర్‌కు ఇచ్చిన అధికారాల్లో కోత, స్వేచ్ఛపై పరిమితి విధించే దిశగా నిర్ణయాలు తీసుకున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ప్లేయర్లు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు వారి వెంట వెళ్లే కుటుంబ సభ్యుల అనుమతులపై కూడా నిబంధనలు విధించినట్లుగా సమాచారం.
అవన్నీ కట్!
బీసీసీఐ గతంలో ఎవరికీ ఇవ్వని అధికారాలు, స్వేచ్ఛను టీమ్ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఇచ్చింది. జట్టు ఎంపికతో పాటు సహాయక కోచ్‌లుగా తనకు ఇష్టమైన వారిని తీసుకొనే అవకాశాన్ని కల్పించింది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మేనేజర్ గౌరవ్ అరోరా ఇప్పటివరకు మ్యాచ్‌లకు హాజరైనప్పుడు, టీమ్ఇండియా ఉండే హోటల్‌లో ఆయనకు బస కల్పించేవారు. ఇకపై ఆయనకు వసతి కల్పించే అవకాశాలు లేవని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. అరోరాకు స్టేడియంలోని వీఐపీ బాక్స్‌లో కూర్చొనే ఛాన్స్ కూడా ఇవ్వరని సమాచారం. గౌతమ్ గంభీర్ సహాయక సిబ్బంది పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తారనే టాక్ వినిపిస్తోంది. పనితీరు ఆధారంగానే వారికి మళ్లీ అవకాశం ఇస్తారని తెలుస్తోంది.
విదేశీ టూర్లో ఆ ఛాన్స్ లేనట్టే
ఇక నుంచి ఏ విదేశీ పర్యటనకైనా భార్య సహా కుటుంబసభ్యులకు ఎవరికీ బీసీసీఐ అనుమతి ఇచ్చే అవకాశం లేదని సమాచారం. ఐదేళ్ల ముందు వరకు అమల్లో ఉన్న నిబంధనలను మళ్లీ తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఉదాహరణకు 45 రోజుల విదేశీ పర్యటనకు టీమ్ఇండియా వెళ్లినప్పుడు, ఆటగాళ్లు తమ కుటుంబసభ్యులతో ఉండేందుకు రెండు వారాలు మాత్రమే అనుమతించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి.
టీమ్ఇండియా విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు సీనియర్ క్రికెటర్లు వారి కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లే సదుపాయాన్ని 2019 నుంచి అమలు చేస్తున్నారు. దీనివల్ల సీనియర్ ఆటగాళ్ల ఆటతీరు దెబ్బతింటోందని ప్రస్తుతం బీసీసీఐ భావిస్తోందట. గత కొన్ని టోర్నమెంట్లలో సీనియర్ ప్లేయర్లు రోహిత్, విరాట్ కోహ్లీ అంతగా రాణించలేకపోయారు. ఈ క్రమంలోనే కఠిన చర్యలకు బీసీసీఐ ఉపక్రమించింది. ఇకపై టీమిండియా ఆటగాళ్లు తాము తీసుకెళ్లే లగేజీ 150 కేజీలకు మించితే, దానికి ఛార్జీలను ప్లేయర్లే చెల్లించాల్సి ఉంటుంది.
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో టీమ్‌ఇండియాకు దారుణమైన పరాభవం ఎదురైంది. ఐదు టెస్టుల సిరీస్‌ను 1-3 తేడాతో భారత్ కోల్పోయింది. అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది. ఈ క్రమంలో శనివారం బీసీసీఐ సమీక్ష సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.