Cricketer Fabian Allen attacked : వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ ఫాబియన్ అలెన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పార్ల్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడిపై కొందరు దుండగులు దాడి చేసేందుకు యత్నించారు. గన్‌తో బెదిరించి అతడి దగ్గర ఉన్న విలువైన వస్తువులను దోచుకుని వెళ్లారు. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దక్షిణాఫ్రికాలోని శాండ్టన్ సన్ హోటల్ దగ్గర ఈ దారుణమైన ఘటన చోటు చేసుకున్నట్లు ఇంగ్లీష్ కథనాల ద్వారా తెలిసింది.
ఫాబియన్కు సంబంధించిన ఫోన్, బ్యాగ్‌తో పాటు మరికొన్ని వ్యక్తిగత వస్తువులను దుండగులు దోచుకుని తీసుకెళ్లినట్లు కథనాల్లో రాసి ఉంది. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారట. అయితే ఫాబియన్ అలెన్‌కు ఎటువంటి గాయాలు కాలేదని, క్షేమంగా ఉన్నట్లు వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. కానీ ఈ ఘటన వల్ల సౌతాఫ్రికా ప్లేయర్స్ భద్రతపై ఆందోళనలు మొదలయ్యాయి. అయితే ఈ సంఘటనపై పార్ల్ రాయల్స్ జట్టు ఇంకా స్పందించనేలేదు. మరోవైపు సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20) నిర్వాహకులు దీనిపై ఆరా తీస్తున్నారు. పోలీసుల నుంచి దర్యాప్తునకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.
మరింత నష్టం కలిగే అవకాశాలు : ఇకపోతే అసలే సౌతాప్రికా క్రికెట్ బోర్డుకు ఆర్థికంగా కష్టాల్లో ఉంది. ఇలాంటి సమయంలో SA20 లీగ్ కాస్త ఊరట ఇచ్చింది. గతేడాది ప్రారంభమైన ఈ లీగ్ రెండో సీజన్ ప్రస్తుతం జరుగుతోంది. ప్లేఆఫ్స్ దశకు లీగ్ చేరుకుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్ల భద్రత విషయంలో సౌతాఫ్రికా బోర్డు వైఫల్యం చెందితే మళ్లీ ఆ బోర్డుకు తీవ్ర నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.