Alakananda Hospital Kidney Racket Case Update : రాష్ట్రంలో సంచనలం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో ప్రధాన నిందితుడు పవన్ అలియాస్ లియోన్ విదేశాలకు పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 3 వారాలుగా నిందితుడి ఆచూకీ చిక్కకపోవడంతో ఇతర దేశాలకు పారిపోయినట్లు దాదాపు అంచనాకొచ్చారు. పవన్ ఆచూకీ కోసం సరూర్‌నగర్ పోలీసులు తాజాగా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. విశాఖకు చెందిన పవన్, అక్రమ కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేయించడంలో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలింది.
తన నెట్‌వర్క్‌తో ఇతర రాష్ట్రాల్లోని నిరుపేదలకు డబ్బు ఆశచూపి కిడ్నీ ఇచ్చేందుకు ఒప్పించడం, గ్రహీతల్ని తీసుకురావడం, ఆపరేషన్లు చేసేందుకు తమిళనాడు, కశ్మీర్ నుంచి వైద్యులను రప్పించి సరూర్‌నగర్‌లోని అలకనంద ఆసుపత్రిలో ఆపరేషన్లు చేయించడం అంతా పవన్ కన్నుసన్నల్లోనే నడుస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలతో ముడిపడి ఉన్న నెట్‌వర్క్‌లో పవన్ ఎక్కడా గుర్తింపు బయటపడకుండా చీకటిదందా నడిపిస్తున్నాడు. నిందితుడు చిక్కితే మరింత మంది పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్న తరుణంలో, అతడు విదేశాలకు పారిపోయినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు.
ఒక్కో ఆపరేషన్‌కు రూ.2.5 లక్షల కమీషన్ : సరూర్‌నగర్‌లోని అలకనంద ఆసుపత్రిలో అక్రమ కిడ్నీ మార్పిడి రాకెట్ కేసులో ఇప్పటివరకు ముగ్గురు వైద్యులు సహా మొత్తం10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా మరో కీలక నిందితుడు మధ్యవర్తిగా వ్యవహరించిన ఏపీలోని విశాఖకు చెందిన లక్ష్మణ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. లక్ష్మణ్ చిన్న స్థాయి ఆసుపత్రుల్ని వెతికి, కిడ్నీ ఆపరేషన్లు చేస్తే కమీషన్లు ఇప్పిస్తామంటూ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హైదరాబాద్‌కు చెందిన వైద్యుడు సిద్ధంశెట్టి అవినాశ్ సైదాబాద్‌లో జనని ఆసుపత్రి నిర్వహించేవాడు. అవినాశ్‌ను లక్ష్మణ్ సంప్రదించి కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేయించేలా ఒప్పించాడు. ఒక్కో ఆపరేషన్‌కు కమీషన్ కింద అవినాశ్‌కు రూ.2.5 లక్షలిచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
90 వరకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు : జనని ఆసుపత్రిలో 2023 ఏప్రిల్ నుంచి 2024 జూన్ వరకు 40కి పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. ఈ క్రమంలోనే అవినాశ్‌కు ప్రధాన నిందితుడు పవన్ పరిచయమయ్యాడు. జనని ఆసుపత్రి మూసేశాక డబ్బుకు ఆశపడ్డ అవినాశ్ సరూర్‌నగర్ అలకనంద ఆసుపత్రి ఎండీ డాక్టర్ గుంటుపల్లి సుమంత్‌ను ఆపరేషన్లకు ఒప్పించాడు. ఒక్కో ఆపరేషన్‌కు సుమంత్ రూ.లక్షన్నర, అవినాశ్ రూ.లక్ష చొప్పున కమీషన్ తీసుకునేవారు. అలకనంద ఆసుపత్రిలో దాదాపు 20కి పైగా, అరుణ ఆసుపత్రిలో 4, మరో ఆసుపత్రిలో 10కి పైగా ఆపరేషన్లు చేయించారు. నిందితులు హైదరాబాద్‌లో దాదాపు 90 వరకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేయించినట్లు దర్యాప్తులో తేలింది.
దందాలో కీలకంగా వ్యవహరించిన రాజశేఖర్ : కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు కీలక నిందితుల్ని కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. అలకనంద ఆసుపత్రి ఎండీ గుంటుపల్లి సుమంత్, జనని ఆసుపత్రి నిర్వాహకుడు అవినాశ్‌ను ఇప్పటికే రెండ్రోజుల కస్టడీకి తీసుకొని విచారించారు. మరో నిందితుడు వైద్యుడు పెరుమాళ్ల రాజశేఖర్‌ను సోమవారం కస్టడీకి తీసుకున్నారు. మూడ్రోజుల కస్టడీకి కోర్టు అనుమతివ్వడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నెల్లూరు జిల్లా మిలిటరీ కాలనీకి చెందిన రాజశేఖర్ తమిళనాడు చెన్నైలోని సవిత మెడికల్ కళాశాలలో వైద్యుడిగా పని చేస్తున్నారు. 2023 మేలో విశాఖ కేంద్రంగా జరిగిన అక్రమ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ల కేసులో రాజశేఖర్ నిందితుడు. అప్పట్లో పోలీసులకు చిక్కిన రాజశేఖర్ జైలుకెళ్లాడు. బయటకు వచ్చిన తర్వాత పవన్ సూచనలతో మళ్లీ హైదరాబాద్ కేంద్రంగా నడిచే దందాలో కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు చెప్పారు.
విశాఖతో కిడ్నీ రాకెట్ లింకులు - ఇంకా మిస్టరీగానే ఆ అంశం!
దేశవ్యాప్తంగా కిడ్నీ రాకెట్ దందా! - అలకనంద ఆసుపత్రి కేసులో సంచలన విషయాలు