BCCI Awards 2024 : టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్, జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రిని 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు'కు (BCCI's Lifetime Achievement Awards-2024) ఎంపిక చేసింది బీసీసీఐ. భారత క్రికెట్‌కు ఎనలేని సేవలను అందించినందుకు గుర్తుగా ఆయనకు ఈ అవార్డును అందించనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ఆటగాడిగా, హెడ్ కోచ్‌గా భారత క్రికెట్ జట్టుకు సేవలందించిన ఆయన ప్రస్తుతం టీవీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
శాస్త్రితో పాటు టీమ్ఇండియా యువ బ్యాటర్ 24 ఏళ్ల శుభ్‌మన్ గిల్‌ను కూడా ఓ అవార్డు వరించింది. 'క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' కేటగిరీలో అతడిని ఈ అవార్డుకు సెలెక్ట్ చేసింది బీసీసీఐ. వన్డేల్లో అత్యంత వేగంగా 2000 పరుగుల మార్క్‌ను దాటడమే కాకుండా ఐదు సెంచరీలను నమోదు చేసిన గిల్‌కు 'క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు లభించింది.
ప్రదానోత్సవానికి ఇరు జట్లు
గురువారం(జనవరి 25) నుంచి ఇంగ్లాండ్-భారత్ మధ్య 5 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రకటించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఇరు జట్లు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం మంగళవారం(జనవరి 23న) హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఇక ఇదే కార్యక్రమంలో ముంబయికి చెందిన యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, షమ్స్ ములానీలకు సైతం అవార్డులను అందించనుంది బీసీసీఐ.