2025 IPL Mega Auction: 2025 ఐపీఎల్ మెగా వేలానికి ముహూర్తం ఖరారైంది. మెగా వేలాన్ని నవంబర్ 24, 25 తేదీల్లో నిర్వహించనున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. రెండు రోజులు సాగనున్న ఈ వేలానికి జెడ్డా (సౌదీ అరేబియా) వేదిక కానుంది. ఈ వేలానికి ఆటగాళ్ల నమోదు (Player Registration) గడువు నవంబర్ 4తో ముగిసింది. 1574 మంది ప్లేయర్లు మెగా వేలానికి అందుబాటులో ఉండనున్నారు. ఇందులో 1165 భారత ఆటగాళ్లు కాగా, 409 మంది ఫారిన్ ప్లేయర్లు ఉన్నారు.
ఫారిన్ ప్లేయర్లలో అత్యధికంగా సౌతాఫ్రికా నుంచి 91మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తర్వాత ఆస్ట్రేలియా నుంచి 76 మంది, ఇంగ్లాండ్ నుంచి 52 మంది, న్యూజిలాండ్ నుంచి 39 మంది క్రికెటర్లు వేలంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
వేలంలో 10 ఫ్రాంచైజీలు కలిపి మొత్తం 204 మంది క్రికెటర్లను కొనుగోలు చేయడానికి వీలుంది. రిటెన్షన్స్ తర్వాత అన్ని ఫ్రాంచైజీల వద్ద మొత్తం రూ.641.5 కోట్ల డబ్బు ఉంది. ఒక్కో ఫ్రాంఛైజీ గరిష్టంగా 25 మంది (రిటైన్ చేసుకున్న ప్లేయర్లతో కలిపి) ఆటగాళ్లను తీసుకోవచ్చు. వేలం కోసం నమోదు చేసుకున్న ఆటగాళ్లలో 320 మంది అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆటగాళ్లు, 1224 మంది అరంగేట్రం చేయని వాళ్లు ఉన్నారు. క్యాప్డ్ ఆటగాళ్లలో 48 మంది, అన్‌క్యాప్డ్ ఆటగాళ్లలో 965 మంది భారతీయులు.